యుపి బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం 

ఉత్తర ప్రదేశ్ బ్లాక్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. రాష్ట్రంలో  825 స్థానాలకు బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ 648 చోట్ల విజయం సాధించింది. వీటిల్లో 335 సీట్లను ఏకగ్రీవంగా గెల్చుకోంది. సమాజ్ వాద్ పార్టీ 92 బ్లాక్ లను కైవసం చేసుకోగా, మిగిలిన చోట్ల ఇతర పార్టీలు గెలుపొందాయి. 

కేంద్రం మార్గదర్శకతంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజల మద్దతును ఈ ఫలితాలు  వెల్లడి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు బీజేపీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం కలిగిస్తున్నాయి. 

“ప్రధాని మోదీ సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అన్న నినాదాన్ని ఇచ్చారు. అలా రూపొందించిన ప్రణాళికలు అందరికీ చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను కింది వరకూ చేర్చింది. దీనికి పంచాయతీ ఎన్నికలే సజీవ ఉదాహరణ’’ అని సీఎం యోగి పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ నిరంతరం తమకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారని, ఆయన మార్గదర్శనం తమకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మోదీ ప్రేరణతోనే రాష్ట్రంలో పనిచేస్తున్నామని, ఆయన రూపొందించిన విధానాలతోనే ఈ విజయం సాధ్యమైందని యోగి చెప్పారు. విజయం సాధించిన అభ్యర్థులందరికీ యోగి శుభాకాంక్షలు తెలిపారు. 

లక్నో, కన్నోజ్ ప్రాంతాల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 8 స్థానాలుండగా, 8 స్థానాల్లోనూ జయ కేతనం ఎగురవేసింది. ఇక మోరదాబాద్‌లో మొత్తం 8 స్థానాలుండగా, 6 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 

భదోహిలో మొత్తం 6 స్థానాలుండగా, 4 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. సీతాపూర్‌లో మొత్తం 19 స్థానాలుండగా 15 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, మిగతా 4 స్థానాలను సమాజ్‌వాదీ కైవసం చేసుకుంది. ఇక హర్దోయ్ పంచాయతీలో మొత్తం 19 బ్లాకులుండగా, 14 సీట్లలో బీజేపీ గెలిచింది.

ఇక ఆగ్రాలో 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. నామినేషన్ దాఖలు సందర్భంగా చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకొని, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  యోగిఆదిత్యనాథ్  అధికారులను ఆదేశించారు. ఆయా పార్టీల అభ్యర్థులు గెలిచినా, ఓడినా వారందరికీ భద్రతనిచ్చి, వారి వారి నివాసాలకు పంపాలని సూచించారు.  

ఓటింగ్‌ సందర్భంగా ఎటావా జిల్లాలో హింస చెలరేగింది. కొందరు మూకుమ్మడిగా పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ గుంపు రాళ్లు విసరడంతోపాటు తుపాకీలతో కాల్పులు జరిపింది.

కాగా, ఇదంతా సీసీటీవీలో రికార్డు అయ్యిందని, ఓటింగ్‌ ముగిసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించి దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఎటావా పోలీస్‌ అధికారి తెలిపారు.