మళ్ళి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఐఏఎన్‌ఎస్‌–సి ఓటరు సర్వేలో వెల్లడైంది. 52 శాతం మంది యోగిదే మళ్లీ సీఎం పదవి అభిప్రాయపడితే, 37 శాతం మంది మాత్రమే మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని భావిస్తున్నారు. 
కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఇటీవల ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. అదే విధంగా ఆ సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కుంభమేళా, గంగానదిలో శవాలు కొట్టుకొని రావడం వంటివన్నీ ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి. 
 
అయినప్పటికీ 52 శాతం మంది యోగికే మొగ్గు చూపించారని ఐఏఎన్‌ఎస్‌–సీఓటరు సర్వే పేర్కొంది. మరోవంక, ప్రధాని నరేంద్ర మోదీ తాజా కొత్త కేబినెట్‌తో దేశంలో పరిస్థితులు మెరుగవుతాయని సర్వేలో 46 శాతం మంది భావిస్తున్నారు. మరో  41 శాతం మంది పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని చెబుతున్నారు.
 
అన్ని నియోజకవర్గాలలో 1200 మంది వయోజనులు నుండి నమూనా  అభిప్రాయాలను సేకరించారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషద్ ఎన్నికలలో మొత్తం 75 జిల్లా పరిషద్ లలో 65 బీజేపీ గెల్చుకోవడం గమనార్హం. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం వచ్చే ఏడాది మార్చ్ 14తో ముగుస్తుంది. 
 
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లు ఉండగా, 2007లో జరిగిన ఎన్నికలలో బీజేపీకి 39.6 శాతం ఓట్లతో 312 సీట్లు గెల్చుకోంది. సమాజ్ వాద్ పార్టీ 47, బీఎస్పీ 19 సీట్లు  గెల్చుకోగా, కాంగ్రెస్ 7 సీట్లతో సరిపెట్టుకోంది. యోగి ఆదిత్యనాథ్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గత మార్చ్ లో జరిపిన ఐఏఎన్‌ఎస్‌–సి ఓటరు సర్వేలో 53 శాతం మంది ఆయన పాలనలో తాము సురక్షితంగా భావిస్తున్నట్లు తెలిపారు.