మూడో దశకు సన్నద్ధత… ఆక్సిజన్ లభ్యతపై ప్రధాని సమీక్ష

మరికొద్ది నెలల్లో దేశంలో కరోనా మూడో దశ విజృంభించే అవకాశం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో దశ ముప్పును ఎదుర్కొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 

ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం  ఆక్సిజన్, ఆసుపత్రులలో వైద్య చికిత్సల సన్నద్ధత వంటి కీలక అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు, సరఫరాపై సమీక్ష నిర్వహించారు. త్వరలో దేశవ్యాప్తంగా 1500 పిఎస్‌ఎ ఆక్సిజన్‌ ప్లాంట్లు రానున్నాయి. పిఎం-కేర్స్‌ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే నాలుగు లక్షలకు పైగా ఆక్సిజనేటెడ్‌ పడకలకు ప్రాణవాయువు అందించేందుకు వీలవుతుందని ప్రధానికి అధికారులు వివరించారు.

 క్రమేపీ ఉత్పత్తి, సరఫరాలు మెరుగు పడుతున్నాయని  అధికారులు ప్రధానికి వివరించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ వీలైనంత త్వరగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా వివిధ మంత్రిత్వశాఖలు, పిఎస్‌యుల నుంచి కూడా ఆక్సిజన్ ప్లాంట్లు ఆరంభం అవుతాయి.

ఆక్సిజన్ నిల్వల ఏర్పాట్లను సరిగ్గా నిర్వహించడం అత్యంత కీలకం. ఈ దిశలో ఆసుపత్రి సిబ్బందికి తగు విధంగా శిక్షణ ఇప్పించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి నిపుణులు తుదిమెరుగులు దిద్దుతున్నారని ప్రధానికి అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ విషయంలో 8000 మందికి శిక్షణ నిప్పించేందుకు రంగం సిద్ధం అయింది.వాటి పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని రూపొందించాలని ప్రధాని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో వ్యవహరిస్తూ ఆక్సిజన్ నిల్వలకు ఢోకా లేకుండా చూసుకోవాలని ప్రధాని ఆదేశించారు.

డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా విరుచుకుపడుతుందని, సెప్టెంబర్ చివరి నాటికి దీనితో తీవ్రస్థాయిలో కరోనా మూడో దశ విస్తరించుకుంటుందనే నిపుణుల విశ్లేషణలపై ప్రధాని ఉన్నతాధికారులతో భేటీలో సమీక్షించారు.

అలాగే కరోనా నిబంధనలపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో కొంతమంది మాస్క్‌లు ధరించకపోవడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కేసులు సంఖ్య తగ్గుతున్నా ప్రమాదం ఇంకా పొంచి ఉందని, చిన్న పాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు.