ఆఫ్ఘన్ లో అమెరికాది విజయసాధ్యం కానీ యుద్ధం: బైడెన్ 

ఆఫ్ఘానిస్తాన్ లో తమది విజయసాధ్యం కాని యుద్ధం అవుతుందని, అక్కడ ఎంత కాలం సేనలు తిష్టవేసుకున్నా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం కుదరదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అఫ్ఘనిస్థాన్‌లో తమ దేశపు 20 సంవత్సరాల యుద్ధం ఆగస్టు 31తో ముగుస్తుందని ప్రకటించారు. 

సాధ్యమైనంత త్వరగా అఫ్ఘన్‌లో ఆపరేషన్‌ను ముగించుకోవాలని, తమ సైన్యాన్ని దశలవారిగా అక్కడి నుంచి ఎత్తివేయడం జరుగుతోందని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఆగస్టు 31తో పూర్తి అవుతుందని, ఈ దిశలో చేపట్టే చర్యలు మరింతవేగవంతం చేయడమే తమకు శ్రేయస్కరం అని తెలిపారు. 

దాదాపు 20 ఎళ్లుగా అక్కడ అమెరికా సేనలు శాంతి పరిరక్షణ దిశలో పాటుపడుతూ వచ్చాయి. ఇక తమ బాధ్యతకు గడువు ముగిసిందని, అఫ్ఘనిస్థాన దేశ పునర్నిర్మాణం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని బైడెన్ స్పష్టం చేశారు. ఇది ఆ దేశపు నేతల విషయం అని, వారంతా కలిసికట్టుగా వ్యవహరించి , సరైన దేశ భవిత కోసం ముందుకు సాగాల్సి ఉందని పేర్కొన్నారు. అమెరికా సేనలు ఇటీవలే అత్యధిక సంఖ్యలో అఫ్ఘన్ వైమానిక స్థావరపు బస నుంచి నిష్క్రమించాయి.

అయితే ఇటీవలి కాలంలో దేశంలో పలు చోట్ల తాలిబన్ల దాడులు పెరగడం, మునుపటి పరిస్థితి తలెత్తుందనే భయాందోళనపై బైడెన్ స్పందించారు. సైనిక ఆపరేషన్ తమ దేశానికి సంబంధించినంత వరకూ ముగిసినట్లే, అక్కడి నుంచి వైదొలగాలనే తమ నిర్ణయం అన్ని విధాలుగా సబబే అని బైడెన్ తెలిపారు. సైనిక చర్యతో పరిష్కారం కాని విషయాలు చాలా ఉంటాయి. అందులో అఫ్ఘన్ అంశం ఒకటని బైడెన్ పదేపదే చెపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి అమెరికా సేనలు పూర్తి స్థాయిలో వైదొలగడానికి రంగం సిద్ధం అయింది. 

మరోవంక, ఆఫ్ఘనిస్థాన్‌లోని 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉన్నదని తాలిబాన్‌ ప్రకటించింది. అమెరికా సైనిక బలగాలు వెనుదిరిగిన తర్వాత సరిహద్దు పట్టణం ఇస్లాం ఖాలాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఇరాన్ సరిహద్దు నుండి చైనా సరిహద్దు వరకు ఉన్న భూభాగం పూర్తిగా తమ ఆధీనంలో ఉన్నట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లోని 398 జిల్లాల్లో 250 జిల్లాలు తమ నియంత్రణలో ఉన్నాయని మాస్కోలోని తాలిబాన్‌ ప్రతినిధులు వెల్లడించారు.