ప్రాంతీయ భద్రతపై ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల ప్రభావం

ఆఫ్ఘనిస్థాన్‌ రాజకీయ, భద్రత పరిస్థితుల ప్రభావం ప్రాంతీయ భద్రతపై ఉంటుందని భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇరు దేశాలకు సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌తో కలిసి సంయుక్త విలేకర్ల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల పట్ల భారత దేశం నిశితంగా దృష్టి సారించిందని జైశంకర్ చెప్పారు. దీనికి కారణాన్ని వివరిస్తూ, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల ప్రభావం ప్రాంతీయ భద్రతపై ప్రత్యక్షంగా ఉంటుందని తెలిపారు. హింస తగ్గడమే తక్షణావసరమని భారత దేశం నమ్ముతోందని పేర్కొన్నారు. 

ఆఫ్ఘనిస్థాన్, దాని పరిసరాల్లో శాంతిని కోరుకోవాలంటే, ఆర్థిక, సాంఘిక రంగాల్లో అత్యధిక అభివృద్ధి జరిగే విధంగా భారత్, రష్యా కృషి చేయాలని చెప్పారు. తాము స్వతంత్ర, సార్వభౌమాధికార, ప్రజాస్వామిక ఆఫ్ఘనిస్థాన్‌కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో హింస పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆ దేశంలో పరిస్థితికి హింస పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఆ దేశాన్ని ఎవరు పరిపాలించినప్పటికీ, న్యాయబద్ధత అంశం ఉత్పన్నమవుతుందని, దీనిని పట్టించుకోకుండా ఉండకూడదని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో భారత దేశానికి రష్యా అందిస్తున్న సహకారానికి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి, వినియోగంలో భారత్, రష్యా భాగస్వాములయ్యాయని తెలిపారు. ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. తాలిబన్ ఉగ్రవాద సంస్థతో చర్చలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.