లోహియా కళలను నెరవేర్చుతున్న ప్రధాని మోదీ 

కేంద్ర మంత్రివర్గంలో ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ)లకు పెద్ద పీట వేయడంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఓబీసీల ప్రాతినిధ్యాన్ని పెంచినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. రామ్ మనోహర్ లోహియా వంటి సామ్యవాదుల కలలు నెరవేరుతున్నాయని కొనియాడారు. 

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండిపడుతూ, సామాజిక మార్పులకు గొప్ప కృషి జరిగేటపుడు కొందరు ఉద్రేకంతో వ్యతిరేకిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నూతన మంత్రివర్గం యావత్తు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందని యోగి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యం, ప్రజల ప్రాతినిధ్యం పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా వంటి మహనీయులు కన్న కలలు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాకారమవుతున్నాయని అయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు అధికారాన్ని ఇచ్చినపుడు మాత్రమే పరిపక్వ ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని లోహియా విశ్వసించారని తెలిపారు.

మోదీ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారని చెప్పారు. కేబినెట్‌లో అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఓబీసీలకు దేశం బాధ్యతను అప్పగించారని గుర్తు చేశారు. రామ్ మనోహర్ లోహియా నేడు ఉంటే తన ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు చాలా సంతోషించి ఉండేవారని తెలిపారు. అర్థవంతమైన, సకారాత్మకమైన సాంఘిక మార్పుకోసం గొప్ప కృషి ప్రారంభం కాగానే కొందరు ఉద్రేకంతో దానిని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు.