ఆఫ్ఘన్ లో 109 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం 

ఆఫ్ఘనిస్తాన్‌ దక్షిణ ప్రావిన్స్‌లలో సైన్యానికి, తాలిబన్‌ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 109 మంది మరణించినట్లు సైన్యం శనివారం వెల్లడించింది. మరో 25 మందికి గాయలైనట్లు తెలిపింది. కాందహార్‌ నగరంతో పాటు ఏడు జిల్లాల్లో సైన్యం తాలిబన్‌ ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతోంది. 
 
శుక్రవారం కాందహార్‌తో పాటు పలు ప్రాంతాల్లో తాలిబన్‌లు చొరబాటుకు యత్నించారని, దీంతో సైన్యానికి, తాలిబన్‌లకు మధ్య భీకర యుద్ధం జరిగినట్లు తెలిపింది. ఆఫ్ఘన్‌ నేషనల్‌ డిఫెన్స్‌అండ్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌( ఎఎన్‌డిఎస్‌ఎఫ్‌), ఆఫ్ఘన్‌ వైమానిక దళం (ఎఎఎఫ్‌) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపడుతున్నట్లు ఆర్మీకి చెందిన 205 అట్టాల్‌ పోలీసుల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాందహార్‌ ప్రావిన్స్‌లో సైన్యం చేపట్టిన కాల్పుల్లో 70 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు మరణించగా, మరో ఎనిమిది మందికి గాయలైనట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో మరో 39 మంది మరణించగా, 17 మందికి గాయాలయ్యాయని తెలిపింది. 
 
ఈ కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ కీలక నేతలు తాజ్ఘౌల్‌, నెహ్మాన్‌లు మరణించినట్లు ప్రకటించింది.  భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ యుద్ధంలో ఎంతమంది సైన్యం గాయపడింది అన్న వివరాలు లేవని అన్నారు. ఈ ఘటనపై తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
ఆఫ్ఘానిస్తాన్ లో సుమారు 85 శాతం ప్రాంతాలను తమ  ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించిన తాలిబాన్లపై ఈ దాడులతో సైన్యం కీలకమైన ఆధిపత్యం వహించినట్లు కనిపిస్తున్నది.