వియత్నాం ప్రధానికి ప్రధాని మోదీ  శుభాకాంక్షలు 

వియత్నాం ప్రధానిగా నియమితులైన ఫామ్‌ మిన్‌ చిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-వియత్నాంల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని, మీ సూచనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కాగలవని ఆశిస్తున్నట్లు మోదీ  పేర్కొన్నారు. 

ఇరు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై ఇరు ప్రధానులు ఫోన్‌లో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హిందూ మహాసముద్ర రీజియన్‌ అంశంలో భారత్‌, వియత్నాంల విజన్‌ ఒకటేనని పెరకోన్నారు. ప్రాంతీయ స్థిరత్వం, శ్రేయస్సు, అభివృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఇలాగే కొనసాగాలని చెప్పారు. 

ఇరు దేశాల మధ్య ఏర్పడిన దౌత్య సంబంధాలు 2022 నాటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటాయని, స్మారక దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలతో వేడుకలు జరుపుకోవాలని ప్రధాని సూచించారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌లో ప్రస్తుతం ఇరు దేశాల సభ్యులు ఉన్నట్లు ప్రధాని గుర్తు చేసుకున్నారు. 

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో వియత్నాం ప్రభుత్వం, ప్రజలు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరులో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా త్వరలో భారత్‌లో అధికారిక పర్యటన చేపట్టాల్సిందిగా చిన్‌ను ప్రధాని ఆహ్వానించారు.