పోలవరంపై ఎన్‌జిటి తీర్పుపై స్టేకు `సుప్రీం’ నిరాకరణ

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భద్రాచలం, సీతారామ స్వామి దేవాలయం సహా, తెలంగాణలో ముంపు నివారించాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఎన్‌జిటి ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం సవాల్‌ చేసింది. 

ఎన్‌జిటి ముందుగా ఒడిశాకు నోటీసులు జారీ చేయలేదని, పలు అంశాలపై స్పష్టంగా చర్చించలేదని ఒడిశా పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అంతర్‌ రాష్ట్ర ఒప్పందాల ప్రకారం ఒడిశా ప్రయోజనాలకు, హక్కులకు వ్యతిరేకంగా ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. 

గరిష్ట వరద విడుదలను 36 లక్షల క్యూసెక్కుల నుండి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతున్నట్లు కమిటీ సూచించడాన్ని ఆ రాష్ట్రం ప్రశ్నించింది. నీటి పారుదల సామర్థ్యాన్ని 7.2 లక్షల ఎకరాల నుండి 15 లక్షల ఎకరాలకు పెంచడం వల్ల రిజర్వాయర్‌లో నీటి నిల్వ పెరుగుతుందని, దీంతో అధిక ప్రాంతాలు జలమయమవుతాయని పిటిషన్‌లో పేర్కొంది. 

371 నివాసాలు, 1.05 లక్షల కుటుంబాలు మునిగిపోయే అవకాశం ఉందని, ఆ కుటుంబాల్లో 70 శాతం వరకు గిరిజనులైన కోయ, కొండ్రెడ్డిలు ఉన్నారని, వారి పునరావాసం కోసం ఎలాంటి ప్రణాళికలు లేవని పిటిషన్‌లో వివరించింది. తమ వాదన వినకుండా ఎన్‌జిటి తీర్పు ఇచ్చిందని ఒడిశా పేర్కొంది. 

సుప్రీం కోర్టులో తమ కేసు పెండింగ్‌లో ఉండగా, ఎన్‌జిటి విచారణ జరపడం తగదని తెలిపింది. తమ అప్పీలు విచారణకు స్వీకరించి ఎన్‌జిటి తీర్పుపై స్టే విధించాలని ఒడిశా తరపు న్యాయవాది కోరారు. స్టేపై పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది అనితా షినారు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఇరువురి వాదనలు విన్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఒడిశా పిటిషన్‌పై నోటీసు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఒరిజినల్‌ సూట్‌కు ఈ పిటిషన్‌ను జత చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది.