బిల్లులు లేకుండానే ఏపీ ప్రభుత్వం రూ 41,000 కోట్లు ఖర్చు 

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రప్రభుత్వం వద్ద రూ.41 వేల కోట్లకు సంబంధించిన బిల్లులు లేవనిలేకుండానే ఖర్చు చేసిన్నట్లు ఆరోపిస్తూ,  రాష్ట్ర ఆర్థిక శాఖపై పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహించాలని టిడిపి శాసన సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ ప్రజా పద్దుల కమిటీ  చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను  రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తామిచ్చిన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.41వేల కోట్లకు పైగా ఎలాంటి బిల్లులు, ఓచర్లు, లావాదేవీల పత్రాలు లేకుండా వేరే పద్దులోకి మార్చారని తెలిపారు. ఇదే విషయాన్ని కాగ్‌ లేఖ రాసిందని వివరించారు. 
 
ప్రైవేట్‌ లిమిటేడ్‌ కంపెనీలాగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారని  కేశవ్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి పూర్తివివరాలను సేకరించి కాగ్‌ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్ష చేయాలని గవర్నర్‌ను కోరామని వెల్లడించారు. ఒక శాఖకు సంబంధించిన మొత్తం వ్యవహారం నిబంధనలు ప్రకారం జరగలేదని వివరించారు. 
 
వీటికి సంబంధించి సాక్ష్యాధారాలతో పాటు కాగ్‌ రాసిన లేఖను కూడా గవర్నర్‌కు ఇచ్చామని తెలిపారు. ఖాతాల నిర్వహణ నిబంధనల ప్రకారం జరగకపోతే పట్టుకోవడం కష్టమని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో జరిగే అవకతవకలు ఏ విధంగా నియంత్రిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.
గతంలో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేది పగడ్బందీగా ఉండేవని, సిఎం డ్యాష్‌బోర్డు చదివితే రాష్ట్రంలో జరిగే సమాచారం మొత్తం తెలిసేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రికైనా చూపిస్తున్నారో లేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్థిక శాఖ అధికారులు చేస్తున్నారో, లేదా కావాలనే చేస్తున్నారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కేశవ్ డిమాండ్‌ చేశారు.