`మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లనే ఇలా కూల్చితే ఎలా? అంతగా ఉంటే ముందుగా పునరావాసం ఏర్పాటు చేసి, పక్కా ఇళ్లు కట్టించాలి. అంతేగానీ, అవేమీ చేయకుండా భయపెట్టి వారిని ఖాళీ చేయాలని చెప్పడం సరికాదు’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
‘ఈ 320 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. అలా చేయకుండా మీరు వారిపై దారుణాలకు పాల్పడితే జనసేన ఊరుకోదు. వారికి అండగా ఉంటాం’ అని స్పష్టం చేసారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రజలతో ముఖాముఖిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు పవన్ కల్యాణ్‌కు తమ కష్టాల గురించి చెప్పుకున్నారు.
అభివృద్ధి పనుల పేరిట, సీఎం భద్రత దృష్ట్యా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని తమ ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం, వైస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు పవన్ కల్యాణ్‌కు చెప్పారు. ఆ భూములను తమకు అప్పజెప్పాలని తమపై దారుణాలకు పాల్పడుతున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు.
ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని, పునరావాసం కూడా ఏర్పాటు చేయకుండా ఇళ్లను లాక్కుంటున్నారని ఆరోపించారు. వృద్ధులను కూడా చూడకుండా ఊరి బయట తీసుకెళ్లి పాడేస్తామని చెబుతున్నారని జనసేన అధినేత ఆందోళన వ్యక్తం చేశారు.
‘ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్న ఉన్న దాదాపు 320 ఇళ్లను ఖాళీ చేయాలని అంటున్నారు. ఆయన నివాసం ఉన్న చోటే ఇలాంటి దారుణాలు జరగడం ఏంటీ? రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా ఖాళీ చేయిస్తున్నామని అంటున్నారు. ఆడవారు అని కూడా చూడకుండా పచ్చి బూతులు తిడుతుంటే బయట మానభంగాలు జరగకుండా ఇంకేమి జరుగుతుంటాయి’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని అంతకు ముందు పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఇద్దరు సీఎంలు చాలా సఖ్యతగా ఉంటున్నామని ప్రకటించారని, మరి వివాదాలు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదం రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందని ధ్వజమెత్తారు.
ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలు అని చెప్పి కేవలం మూడు వేల ఉద్యోగాలు ప్రకటించారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతకి అండగా జనసేన పార్టీ ఉంటుందని, దీనిపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. బూతులు తిట్టే నేతలు ఉంటే సమాజం ఎటు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి చేసి పథకాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వానికి హితవు చెప్పారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల