వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీల (ఏపీఎంసీ- మండీ)లకు రూ 1 లక్ష కోట్లతో పాటు రూ 23,132 కోట్లతో కరోనా ప్యాకేజీకి ఆమోదం తెలుపుతూ భారీ మార్పులతో ఏర్పడిన నూతన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన మొదటి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులు తమ ఆందోళనను ఈ నెల 19 నుండి సమావేశాలు జరుగనున్న పార్లమెంట్ వద్ద ఉధృతం చేస్తామని ప్రకటించిన సమయంలో మండీల బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం గమనార్హం.
ఈ నిర్ణయం ద్వారా నూతన వ్యవసాయ చట్టాలు మండీల మూసివేతకు దారితీయవని, వాటిని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు అయింది.
సమావేశాలు జరిగే అన్ని రోజులు పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతామని, తమ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు ప్రతిపక్షాలు సభ జరుగకుండా అడ్డుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల పిలుపునిచ్చింది. మంత్రివర్గ సమావేశం అనంతరం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొనే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.
ఇతర అవకాశాలు, సమస్యలపై రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ నిరసన ముగించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని మరోసారి పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు మౌలిక సదుపాయాల నిధికి ఆత్మనిర్భర్ భారత్ కింద కేటాయించిన రూ . లక్ష కోట్లు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు ఉపయోగించుకోవచ్చని వివరించారు.
వ్యవసాయ చట్టాల అమలు తరువాత కేంద్ర మౌలికసదుపాయాల నిధుల నుంచి కోట్ల రూపాయలు మార్కెట్ కమిటీలకు అందుతాయని, వాటి బలోపేతంతోపాటు ఎక్కువ మంది రైతులకు ఈ నిధి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మరోవంక, రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి నూతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర్డ్ వేవ్‌కు సన్నద్ధమయ్యేందుకు కొత్త అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ కింద రూ.23,132 కోట్ల ఫండ్‌ను ప్రకటించింది.
ఇందులో రూ.15,000 కోట్ల నిధులను కేంద్రం ఖర్చు చేస్తుందని, రూ.8,000 కోట్ల నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తారని కొత్త కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. 736 జిల్లాల్లో పీడియాట్రిక్స్ విభాగాలు, 20,000 కొత్త ఐసీయూ పడకల ఏర్పాటు ఇందులో 20 శాతం పడకలు పిల్లల కోసం, నర్సింగ్ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, జిల్లా స్థాయిలో ఔషధాల బఫర్ స్టాక్ కోసం ఈ ప్యాకేజీ సహాయపడుతుందని చెప్పారు.
రానున్న 9 నెలల్లో ఈ ప్యాకేజీని అమలు చేస్తామని, వచ్చే ఏడాది మార్చిలోపు ఇది పూర్తవుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత ఈ నిధులను కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ ప్యాకేజ్‌ను ప్రకటించడం ద్వారా భవిష్యత్తులో ఈ మహమ్మారిపై పోరాటానికి భారత దేశం మరింత మెరుగ్గా సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పోరాటాన్ని వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే ఈ కార్యకలాపాలను నిర్వహించాలని కోరారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు