తెలంగాణలో ఉగ్రవాదుల అరెస్ట్ ల కలకలం

తెలంగాణలో ఉగ్రవాదుల అరెస్టులు కలకలం రేపుతున్నాయి. బీహార్ రాష్ట్రంలోని దర్బంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నాసిర్ ఖాన్‌ అనే ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాది అరెస్టు అయ్యారు. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడిన బోధన్ యువకుడిని హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం అదుపులోకి తీసుకుంది. సౌదీ అరేబియాలో ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చి యువకుడు పరారీ అయ్యాడు. ఈ విషయంపై సౌదీ ప్రభుత్వం ఆరా తీసింది.
ఆ  యువకుడు నిజామాబాద్ జిల్లా బోధన్ రెంజల్ బేస్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి భారత ప్రభుత్వానికి సౌదీ ప్రభుత్వం సమాచారమిచ్చింది. యువకుడిని హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం అరెస్టు చేసి తీసుకెళ్లింది. నిజామాబాద్ సీపీ నేతృత్వంలో యువకుడిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇటీవల హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు. దర్బంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న పార్శిల్ బాంబు పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ నుంచి ఆ పార్శిల్ వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగేలా లష్కరే తొయిబా కుట్ర పన్నిందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
2012లో నాసిర్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని, రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో శిక్షణ తీసుకున్నాడని చెప్పారు. తిరిగి భారత్ వచ్చిన తర్వాత సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడు. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్బంగా రైల్లో పార్శిల్ పంపారు.
రైలులోనే పేలి మంటలు వ్యాపించి అధిక ప్రాణ నష్టం జరిగేలా కుట్ర పన్నారు. నాసిర్, ఇమ్రాన్ తరచూ లష్కరే తొయిబా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఇమ్రాన్, నాసిర్‌లను అధికారులు విచారిస్తున్నారు. ఇంకా ఏమైనా పేలుళ్లకు కుట్ర పన్నారా? అనే వివరాలను తెలుసుకునేందుకు నిందితులను విచారిస్తున్నారు.