చర్లపల్లి – తిరుచానూరు (తిరుపతి) మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – తిరుచానూరు (తిరుపతి) మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు
చర్లపల్లి – తిరుచానూరు (తిరుపతి) మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలుకు జెండా ఊపి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. చర్లపల్లి – తిరుచానూరు (ట్రైన్ నెం. 17059) ప్రతి ఆదివారం రాత్రి 21:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు – చర్లపల్లి (ట్రైన్ నెం. 17060) రైలు తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం సాయంత్రం 16:00 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, మంగళవారం ఉదయం 08:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రధాన స్టాపింగ్‌లు (తెలంగాణ): ఈ రైలు తెలంగాణలో మల్కాజ్‌గిరి, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల స్టేషన్లలో ఆగుతుంది.

ప్రధాన స్టాపింగ్‌లు (రాయలసీమ): ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట జంక్షన్లలో ఈ రైలుకు స్టాపింగ్స్ ఉన్నాయి. సుఖవంతమైన ప్రయాణం కోసం ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్‌లతో కలిపి మొత్తం 20 అత్యాధునిక కోచ్‌లను ఏర్పాటు చేశారు.

కొత్తగా అభివృద్ధి చెందిన చర్లపల్లి టెర్మినల్ వల్ల సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు, తెలంగాణ, రాయలసీమ జిల్లాల భక్తులకు కనెక్టివిటీ పెరగనుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులు ఈ నూతన రెగ్యులర్ రైలు సౌకర్యాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.