ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి

ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి
ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికి ఒక్క ఓటు ఒక్క దగ్గర మాత్రమే ఉండాలని చెప్పుకొచ్చారు. ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా ఒక్కొక్కరి ఓటు పది ప్రాంతాల్లో చూపిస్తోందని తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్ వచ్చిందని ప్రస్తావించారు. ఓటర్ లిస్టు సరిదిద్దడంలో అందరి బాధ్యత ఉందని తెలిపారు.  ఓక్కో పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక్కో ఇంటికి మూడు సార్లు వెళ్తారని చెప్పారు. 
 
పైగా, ఎస్ఐఆర్ చేసేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, బీజేపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు. ఇందులో కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎక్కడ కుట్ర జరుగుతుందో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెప్పాలని నిలదీశారు. కేరళం, తమిళనాడులో బీజేపీ గెలవలేదు కాబట్టి అక్కడ ఎస్ఐఆర్ బాగా జరిగిందని అంటున్నారని తెలిపారు. 
 
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ గెలిచింది కాబట్టి అక్కడ ఎస్ఐఆర్ లో తప్పు జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని,  ఎలక్షన్ కమిషన్‌పై బురద జల్లవద్దని కిషన్‌‌రెడ్డి హితవు పలికారు. ఎస్ఐఆర్ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందని గుర్తు చేశారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉంటే ఒక్కొక్కరిని వెతికి తొలగించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. 
 
విదేశీయులను తొలగిస్తే రాహుల్‌గాంధీకి వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్‌లో సర్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉందని, కేంద్ర సిబ్బంది కాదని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ రెండుసార్లు గెలిచి మంత్రి అయితే అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ మంచిదా? అని నిలదీశారు. 

రెండున్నరేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కిషన్‌‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు అరకొర రుణమాఫీతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం అండగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోందని ప్రశ్నించారు. ఎంఎస్పిని కేంద్రం పెంచిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని తెలిపారు. 

రూ.500 బోనస్ ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని కిషన్‌‌రెడ్డి గుర్తు చేశారు. సన్నవడ్లకు కూడా బోనస్ పూర్తిగా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ధాన్యం కొనుగోలులో ప్రతి పైసా కేంద్రం ఇస్తోందని స్పష్టం చేశారు.