వైసిపి ఎంపీ రాంకీ  కంపెనీలపై ఐటీ సోదాలు 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి చెందిన ‘రాంకీ’ సంస్థలపై మంగళవారం ఏకకాలంలో హైదరాబాద్‌లోని 15 చోట్ల ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఒకవైపు రాంకీ ఇన్‌ఫ్రా షేర్‌ ధర అనూహ్యంగా పెరుగుతుండగా, మరోవైపు రాంకీ గ్రూప్‌నకు చెందిన ఇతర సంస్థలు నష్టాలు చూపుతున్న సమయంలో ఈ సోదాలు జరగడం గమనార్హం. 

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ టవర్స్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు,  దానిపక్కనే ఉన్న ‘రాంకీ సీఈవో ఎన్‌క్లేవ్‌’లోని సంస్థ ముఖ్యుల నివాసాలలో సోదాలు జరిగాయి. అయోధ్య రామిరెడ్డి నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం మొదలైన ఈ ప్రక్రియ.. రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. 

రాంకీ చూపించిన నష్టాలు, అనుబంధ సంస్థల మధ్య జరిగిన లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా… గ్రూప్‌ కంపెనీల మఽధ్యే వందల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటి మధ్య జరిగిన అమ్మకం, కొనుగోళ్ల ఇన్వాయి్‌సలలో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. 

కంపెనీ చెల్లించిన అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వివరాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. ‘రాంకీ’ గ్రూప్‌లో రాంకీ ఇన్‌ఫ్రా, రాంకీ ఇంజనీర్‌ ప్రధానసంస్థలు. అయోధ్య రామిరెడ్డి ఎంపీ కాగానే ఈ సంస్థల డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.  ఈ ఏడాది రాంకీ ఇన్‌ఫ్రా షేర్‌ విలువ భారీగా పెరిగింది. 52 వారాల కనిష్ఠ విలువ రూ.27.40 కాగా.. బీఎ్‌సఈలో ఈ ఏడాది ఏప్రిల్‌ మొదట్లో రూ.76.45 ఉన్న షేర్‌.. జూన్‌ 1 నాటికి రూ.89కి చేరింది. జూలై 6కి రూ.189.65కు పెరిగింది. సోమవారం ముగింపు ధర ఏకంగా రూ.200.45. మంగళవారం 210.45తో మొదలైంది.

గత కొద్దికాలంగా ఈ షేర్లు భారీగా చేతులు మారుతున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు గుర్తించాయి. దీనిపై ఇటీవల కంపెనీ వివరణ కోరాయి. ‘మార్కెట్‌లో పరిణామాలకు అనుగుణంగానే మా షేరు ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి. మేం ఎలాంటి సమాచారాన్ని దాచిపెట్టలేదు’ అని రాంకీ ఇన్‌ఫ్రా బదులిచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా మార్కెట్‌ వర్గాల్లో భారీగానే చర్చ జరుగుతోంది. ఇదే గ్రూప్‌నకు చెందిన ‘రాంకీ ఎన్విరో’ త్వరలో ఐపీవోకు వెళ్లాలని భావిస్తోంది. గ్రూప్‌లో ప్రధాన కంపెనీ షేర్‌ విలువ బలంగా ఉంటే, అనుబంధ సంస్థ  ఐపీవోకూ ఆదరణ లభిస్తుందనే ‘రాంకీ ఇన్‌ఫ్రా’ షేర్‌ ధరను కృత్రిమంగా పెంచుతూ వచ్చారని అనుమానాలున్నాయి. 

‘తనదైన శైలిలో’ వంద షేరును వెయ్యి చేసిన ఒక వ్యక్తి అనుభవాన్ని రాంకీ ఉపయోగించుకుంటోందని చెబుతున్నారు. రకరకాల మార్గంలో నిధులను ‘పంప్‌’ చేయడం ద్వారా ఇన్‌ఫ్రా షేర్‌ వ్యాల్యూను పెంచారనే అనుమానాలున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని… స్టాక్‌ ఎక్స్ఛేంజీ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో మంగళవారం రాంకీ ఇన్‌ఫ్రా షేర్‌ ధర ఐదు శాతం పడిపోయి 189.65 వద్ద క్లోజ్‌ అయింది. రాంకీ ఇన్‌ఫ్రా సెక్రటరీ, కంప్లయన్స్‌ ఆఫీసర్‌ అర్జున్‌ ఉపాధ్యాయ ఇటీవలే రాజీనామా చేయడం గమనార్హం. కొత్తగా… నండూరి కేశవ దత్తను కంపెనీ సెక్రటరీ, కంప్లయన్స్‌ ఆఫీసర్‌, కీలక మేనేజిరియల్‌ పర్సన్‌గా నియమించారు.

కాగా, అయోధ్యరామి రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇడి దాఖలు చేసిన  ఒక కేసులో సహా నిందితుడు. ఆయన  సోదరుడు రామకృష్ణ రెడ్డి మంగళగిరి  వైసిపి ఎమ్యెల్యే.