టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష

ఖైరతాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. 
 
బంజారాహిల్స్ లో 2012లో కారుకు అడ్డు వచ్చిన ఓ పోలీసుపై దాడి చేసి బెదిరించారన్న అభియోగంపై దానం నాగేందర్ తోపాటు చట్నీ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఇటీవల ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి అభియోగపత్రం బదిలీ అయింది.
 
తాజాగా దీనిపై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు నాగేందర్‌ణు దోషిగా తేల్చింది. ఆయనపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో నాగేందర్‌కు జైలు శిక్ష విధించింది. అయితే, దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు అనుమతించిన న్యాయస్థానం.. శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేసింది.
గతంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వై ఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.