ఎన్‌సీపీ నేత ఖడ్సే అల్లుడి అరెస్టు

పుణెలో 2016లో భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన అవకతవకలపై ఎన్‌సీపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు గిరీష్ చౌదరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. 

ముంబైలోని ఈడీ కార్యాలయంలో మంగళవారం అర్థరాత్రి వరకూ చౌదరిని ప్రశ్నించిన ఈడీ, ఆ తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసింది. ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనుంది. ఖడ్సే 2020 అక్టోబర్‌లో బీజేపీని విడిచిపెట్టి ఎన్‌సీపీలో చేరారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఆయనకు ఈడీ సమన్లు పంపింది. ముంబైలో సుమారు 6 గంటల సేపు ప్రశ్నించింది.

2016లో దేవేంద్ర ఫడ్నవిస్‌ మంత్రివర్గంలో పనిచేసిన ఖడ్సే..రూ.30 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని 3 కోట్లకు పర్చేజ్ చేసేందుకు వీలు కల్పిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.  2017లో ఖడ్గే, ఆయన భార్య మందాకిని, చౌదరి, స్థల యజమాని అబ్బాస్ అఖానీలపై మహారాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, 2018లో ఏసీబీ ఒక నివేదికలో ఖడ్సేకి క్లీన్ చిట్ ఇచ్చింది.

మరోవంక, మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ మంత్రి క్రిపాశంకర్ సింగ్ బుధవారంనాడు బీజేపీలో చేరారు. ముంబైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాత్ పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
క్రిపాశంకర్ చేరికపై బీజేపీ నేత మాధవ్ భండారి మాట్లాడుతూ, క్రిపాశంకర్ సింగ్ పెద్ద నాయకుడని, ముంబై రాజకీయాల్లో పట్టు ఉన్న నేత అని చెప్పారు. గత కొద్ది నెలలుగా పార్టీతో ఆయన సంప్రదింపులు సాగిస్తున్నారని తెలిపారు. బీఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నార్త్ ఇండియన్ ఫేస్‌గా ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలపై అడిగినప్పుడు, తప్పనిసరిగా ముంబై నగరంలో ఆయన పెద్ద నాయకుడని, అయితే ఆయనకు ఏ బాధ్యత ఇస్తారనేది పార్టీ నిర్ణయిస్తుందని, త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని మాధవ్ భండారి సమాధానమిచ్చారు.