వ‌చ్చీ రాగానే ఐటీశాఖ మంత్రి ట్విట్ట‌ర్‌కు వార్నింగ్

కేంద్ర ఐటీశాఖ మంత్రిగా ఇవాళే బాధ్య‌త‌లు చేప‌ట్టిన అశ్విని వైష్ణ‌వ్‌  వ‌చ్చీ రాగానే సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్ట‌ర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేల‌పై రూపుదిద్దుకున్న చ‌ట్టాలే అత్యున్న‌త‌మ‌ని, క‌చ్చితంగా కొత్త ఐటీ రూల్స్‌ను ట్విట్ట‌ర్ పాటించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. 

ఇటీవ‌ల ట్విట్ట‌ర్ సంస్థ‌కు, కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. మాజీ ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కూడా ప‌లు మార్లు ట్విట్ట‌ర్‌కు ఇలాంటి వార్నింగ్‌లే ఇచ్చారు. కానీ ట్విట్ట‌ర్ మాత్రం త‌న వైఖ‌రిని మార్చుకోవ‌డం లేదు.

ఇవాళ ఢిల్లీ హైకోర్టులోనూ ట్విట్ట‌ర్ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌తో ఎట్టకేలకు ట్విటర్‌ దిగొచ్చింది. ఎనిమిది వారాల గడువు ఇస్తే గ్రీవెన్స్‌ రెడ్రస్సల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని విన్నవించింది.

అంతేకాదు ఇంటీరియమ్‌ చీఫ్‌ కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌ను ఇదివరకే(రెండు రోజుల క్రితమే) నియమించామని, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను కూడా నిర్ణీత కాలవ్యవధిలో.. అది కూడా కొత్త ఐటీ రూల్స్‌కు లోబడే నియమిస్తామని కోర్టుకు వెల్లడిస్తూ.. ఎనిమిది వారాల గడువు కోరింది. కాగా, ‘మీ ఇష్టం ఉన్నప్పుడు గ్రీవెన్స్‌ అధికారిని నియమిస్తామంటే ఊరుకునేది లేదు’ అంటూ హైకోర్టు రెండు రోజుల క్రితం జరిగిన వాదనల్లో ట్విటర్‌పై మండిపడింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సమాధానం ఇచ్చింది.

ఇక ఈ మూడు పొజిషన్‌లకు కోసం జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటనలు ఇచ్చినట్లు ట్విటర్‌ వెల్లడించింది. ఇదిలా ఉంటే ట్విటర్‌ ఆ మధ్య నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ధర్మేంద్ర చాతుర్‌  అనూహ్యంగా తప్పుకున్నారు.  ఈ పొజిషన్‌లో భారత్‌కు చెందిన వాళ్లనే నియమించాలనే నిబంధన కూడా ఉంది.  గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్‌ను పెట్టాల‌ని కేంద్రం కోరినా/ ట్విట్ట‌ర్ మాత్రం స్పందించ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆ సంస్థ‌కు వార్నింగ్ ఇచ్చింది. కావాల్సినం స‌మ‌యం ఇవ్వ‌లేమ‌ని హైకోర్టు జ‌స్టిస్ రేఖా పాలి త‌న తీర్పులో స్పష్టం చేశారు.