గోరక్షకుడు  సంజయ్  పై హత్యాయత్నం….. నేడే నిరసన 

ఆదివారం తెల్లవారు జామున ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోవుల అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని ఆపిన సంజయ్ అనే గోరక్షకునిపై నింధితులు దాడిచేసి, అతనిపై రెండు సార్లు వాహనాన్ని ఎక్కించి హత్యాయత్నం చేసి అక్కడి నుండి తపించుకున్నారు . తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంజయ్ సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

అతని పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటల గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. యశోదా హాస్పిటల్ లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న సంజయ్ ను  విశ్వ హిందూ పరిషద్  రాష్ట్ర అధ్యక్షులు ఎం  రామరాజు,  అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చందర్, పరిషద్ నగర  అధ్యక్షులు శ్రీనివాస రాజ లు పరామర్శించి చికిత్సకు సంబంధించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు .

అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని వారు కోరారు. ఈసందర్భంగా పరిషద్ అధ్యక్షులు రామరాజు మాట్లాడుతూ ఎంఐఎంఐఎం ఎజెండాలో భాగంగానే గోరక్షకులపై హత్యాయత్నం జరిగిందని,  గో అక్రమ రవాణాదారులు బహిరంగంగానే గోరక్షకులపైకి వాహనాలు ఎక్కించి చంపమని పిలుపునిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. 

గోహత్య నిరోధక చట్టాలను అమలు చేయొద్దని హైదరాబాద్ ఎంపీ  అసదుద్దీన్‌ ఓవైసి రాష్ట్ర డిజిపికి ఫత్వా జారీ చేశాడని ఆరోపించారు.  గోరక్షకులపై జరుగుతున్న హత్యా కాండ ఎంఐఎంఐఎం ఎజెండాలో భాగంగా ప్రభుత్వం, పోలీసులు చేయిస్తున్న హత్యాకాండగానే హిందూ సమాజం భావిస్తుందని  స్పష్టం చేశారు. 

సంజయ్ పై జరిగిన హత్యాయత్నాన్ని పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే  నింధితులను అరెస్టు చేయకపోతే ,గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయడానికి సరైన చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

కాగా, తెలంగాణాలో గోహత్యలకు మరియు గోరక్షకులపై దాడులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం,  నిరసన కార్యక్రమానికి భజరంగ్ దళ్ రాష్ట్ర శాఖ పిలుపిచ్చింది. గోరక్షకుడు సంజయ్ పై హత్యాయత్నం చేసిన నింధితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, గోరక్షకులను హత్య చేయాలని పిలుపునిస్తున్న గుండాలను వెంటనే అరెస్టు చేయాలని, గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. 

గో అక్రమ రవాణా గ్యాంగ్ ల పై పి.డి యాక్టు నమోదు చేయాలని, గో అక్రమ రవాణా దారులతో కుమ్మక్కైన పోలీసు అధికారులను డిస్మిస్ చేయాలని, గోరక్షకులపై పోలీసు వేధింపులు, అక్రమ కేసులు ఆపాలని కోరింది. గో అక్రమ రవాణా నిలుపుదలకై శాశ్వత చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, గోవధ శాలల పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

ఆవులను కాపాడే ప్రయత్నం చేసిన సంజయ్ అనే యువకుడిని ఎంఐఎం కార్యకర్తలు హత్య చేసేందుకు యత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హిందువు అని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. బక్రీద్‌లో అవులను వధిస్తామంటే అడ్డుకుని తీరుతామన్నారు. గోవధ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.