ఒవైసీ సవాల్ ను తిప్పికొట్టిన యోగి ఆదిత్యనాథ్

కొద్దీ నెలల్లో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ ను తిరిగి ముఖ్యమంత్రి కానీయబోనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన సవాల్ ను ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు. మీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యోగి కౌంటర్ ఇచ్చారు.
 
‘‘యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ సీఎం కానివ్వం. నిబద్ధతతో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమే. యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకూదన్నదే టార్గెట్’’ అని ఒవైసీ చెప్పడాన్ని యోగి ఎద్దేవా చేశారు. బీజేపీ గెలుపుపై ఎలాంటి సందేహం అవసరం లేదని, తిరిగి తామే అధికారాన్ని చేపడతామని, బీజేపీ కార్యకర్తలు ఆయన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారని యోగి ప్రకటించారు. 
 
‘‘ఒవైసీ జాతీయ నేత. ప్రచారం నిమిత్తమై ఆయన దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రజల్లో ఆయనకు కాస్తో కూస్తో గుర్తింపు ఉంది. ఆయన మాకు ఛాలెంజ్ విసురుతున్నారు… బీజేపీ కార్యకర్తలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. ఎన్నికల తర్వాత తిరిగి బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులో సందేహం లేదు. 300 కు పైగా సీట్లను సాధిస్తాం’’ అని యోగి ధీమా వ్యక్తం చేశారు.
 
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతూ  ఇందులో ఏ అనుమానం లేదని యోగి భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం 300 పైగా సీట్లలో గెలవాలని టార్గెట్ పెట్టుకుందని పేర్కొంటూ తాము కచ్చితంగా గెలుస్తాం కూడా అని యోగి స్పష్టం చేశారు.
 
ఉత్తర్ ప్రదేశ్ లో 100 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఒవైసి తన పార్టీ ఓం ప్రకాష్ రాజభర్ చిన్నపార్టీలతో ఏర్పాటు చేసిన `భాగిదారి సంకల్ప్ మోర్చా’ కూటమితో కలసి పొత్తు ఏర్పాటు చేస్తుకున్నట్లు తెలిపారు. ఈ కూటమిలో ఎంఐఎంఐఎం తో పాటు రాజభర్ నేతృత్వంలోని సుహేల్ దేవ్ సమాజ్ పార్టీ, కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నా దళ్, జన్ అధికార్ పార్టీ, చంద్రశేఖర్ రావణ్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ ఉన్నాయి. 
 
ఈ కూటమి గురించి యోగి ప్రస్తావిస్తూ ప్రతి పార్టీకి తమకు నచ్చిన పార్టీలతో కలసి పొత్తు ఏర్పర్చుకొనే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అయితే 2017, 2019 ఎన్నికలలో యుపిలో ఈ విధంగా ఏర్పడిన కూటములకు ఎదురైన పరిస్థితే ఈ సారి కూడా తప్పదని స్పష్టం చేశారు.