ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ప్రమాణ స్వీకారం

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
 సత్‌పాల్ మహారాజ్, హరక్ సింగ్ రావత్, వంశీధర్, యశ్‌పాల్ ఆర్య, బిషన్ సింగ్, సుబోథ్ ఉనియాల్‌, అరవింద్ పాండ్యే, గణేశ్ జోషి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి11వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన గత నాలుగు నెలల్లో మూడవ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. 
తీర్థ్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజుననే ప్రమాణస్వీకారం చేశారు. 45 సంవత్సరాల పుష్కర్ సింగ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన వారిలో అత్యంత తక్కువ వయస్సు గలవారు కావడం గమనార్హం. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్ రావత్, తీర్థ్ సింగ్ రావత్ లను కలసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సవాళ్ళను ఒక అవకాశంగా తీసుకుంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 
“వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒక సవాల్ అనడంలో సందేహం లేదు. అయితే వీటిని తాము అంతా కలసి అవకాశంగా మార్చుకుంటామని ఆయన భరోసా వ్యక్తం చేశారు.