తీరథ్‌ సింగ్‌ రాజీనామాతో ఇరకాటంలో మమతా!

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. శాసనసభ్యులు కానివారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల లోగా ఏదో నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నక కాలేని పక్షంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందనే అంశాన్ని ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వం తెరపైకి తెచ్చింది. 
 
ప్రస్తుతం మమతా బెనర్జీ సహితం అటువంటి పరిస్థితులలోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందినా ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలల లోగా ఉపఎన్నికలు జరిగి ఆమె శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం కనిపించడం లేదు. 
 
దానితో ఆమె గద్దె దిగాక తప్పని పరిస్థితులను బిజెపి వ్యూహాత్మకంగా ఏర్పర్చుతున్నట్లు టిఎంసి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తీరథ్‌ సింగ్‌.. నాలుగు నెలలు కూడా గడవకుండానే రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164(4) ప్రకారం . మంత్రిగా నియమితులైన వ్యక్తి ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజకవర్గ సభ్యులుగా ఉండి తీరాలి.
లేకుంటే సిఎంగా రాజీనామా చేయాల్సి వుంటుందని గ్రహించి ముందుగానే బిజెపి అధిష్ఠానం ఆయనతో రాజీనామా చేయించింది. ఇదే పరిస్థితి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నుండి బరిలోకి దిగారు. అయితే ఆ నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి సువేందు  అధికారి మమతపై  1956 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
టిఎంసి విజయం సాధించడంతో మమత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు  ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి వుంది. అందుకు అనుగుణంగానే ఆమె భవానీపూర్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. నవంబరు 4 నాటికి ఆమె ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి వుంది.
పశ్చిమబెంగాల్‌లో కూడా ఉత్తరాఖండ్‌లో లాగా శాసన మండలి ఉనికిలో లేదు. దీంతో మమతకు ఎమ్మెల్సీ ఛాన్స్‌ లేదు. ఈ నేపథ్యంలో ఆమె కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరాల్సిందే. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోతే పశ్చిమబెంగాల్‌లో రాజ్యాంగ సంక్షోభం తప్పదు.
తీరథ్‌ లాగే మమత కూడా రాజీనామా చేయాల్సిందే. ఒక వేళ ఆమె  రాజీనామా చేస్తే ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సువేందు అధికారి గెలుపును సవాలు చేస్తూ మమతా బెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ అంశంలో తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది.