యుపి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బిజెపి విజయభేరీ

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార బిజెపి భారీ విజయం దిశలో సాగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో స్థానిక ఫలితాలు కీలకంగా మారాయి. ప్రస్తుత పరిస్థితి సమాజ్‌వాది పార్టీకి గడ్డుగా మారింది. 

మొత్తం 75 జిల్లా పంచాయత్ అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరగగా వీటిలో బిజెపి 66 స్థానాలను గెలుచుకోగా, దాని మిత్రపక్షం అప్నాదాల్మారో స్థానం గెలుచుకొంది.  రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల పరిషత్‌లకు అధ్యక్ష ఎన్నికలు శనివారం జరిగాయి. అఖిలేష్ యాదవ్ సారథ్యపు ఎస్‌పి కేవలం ఐదు  స్థానాలకు పరిమితం కానుంది. జనసత్తా దళ్, ఎస్పీ మిత్రపక్షం ఆర్ ఎల్ డి చేరొక్క స్థానం గెలుచుకోగా, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 

మొత్తం 22 స్థానాల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన వాటిల్లో సమాజవాద్ పార్టీ ఒక స్థానం గెలుచుకోగా, మిగిలిన వాటిని బిజెపి గెలుచుకొంది. 2016లో ఈ స్థానాలకు జరిగిన ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీ 60 స్థానాలు దక్కించుకుంది. స్థానిక బలం చాటుకుంది. ఇప్పుడు ఈ కథ మారింది.

ఫలితాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం ప్రకటిస్తూ “యుపి జిల్లా పంచాయతీ ఎన్నికలలో బిజెపి సాధించిన అద్భుతమైన విజయం రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సేవ, న్యాయ పాలన కోసం ప్రజల ఆశీర్వాదం. దీని ఘనత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విధానాలకు, కార్మికుల కృషికి దక్కుతుంది. దీనికి యూపీ ప్రభుత్వానికి, బీజేపీ సంస్థకు అభినందనలు”అంటూ ట్వీట్ చేశారు.

ఫలితాలపై హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జె పి నడ్డా కూడా ఆదిత్యనాథ్ ను అభినందించారు.ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ విజయానికి ప్రధానమంత్రి మోదీ  ప్రజా సంక్షేమ పథకాలకు ఘనత ఇచ్చారు. “ఇది (గెలుపు) రాష్ట్రంలో సుపరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని కూడా చూపిస్తుంది. నేను ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారిని అభినందిస్తున్నాను” అని ట్వీట్ చేశాడు.

ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ట్వీట్ చేస్తూ, “జిలా పంచాయతీ ఎన్నికలలో చారిత్రాత్మక విజయం ప్రభుత్వ సంస్థాగత నైపుణ్యాలు, సంక్షేమ పథకాల వల్ల సాధ్యమైంది. బిజెపి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు” అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు పార్టీ చిహ్నాలపై జరగక పోయినా, అభ్యర్థులు వేర్వేరు పార్టీల మద్దతుతోనే పోటీ చేశారు. 

ఈ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాల అసహనాన్ని ప్రశ్నిస్తూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రజాస్వామ్య సరిహద్దులను గౌరవించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పంచాయతీ ఎన్నికల ఇన్‌ఛార్జి విజయ్ బహదూర్ పాథక్ హితవు చెప్పారు.

“తన పార్టీ ఎటావాలో పోటీ లేకుండా గెలిచినప్పుడు, అజాంఘర్ లో 11 మంది బిజెపి సభ్యులలో ఆరుగురికి మద్దతు ఇస్తే, అతను దానిని ప్రజాస్వామ్యం అని పిలుస్తాడు. తన 11 మంది సభ్యులలో ఆరుగురు తనకు మద్దతు ఇవ్వనప్పుడు, అతను దానిని ప్రజాస్వామ్య హత్య అని పిలుస్తాడు… ఎస్పీ చీఫ్ బహిరంగంగా ఎన్నికల అధికారులను బెదిరించాడని ఎన్నికల కమిషన్  తెలుసుకోవాలి” అని పాథక్ ఎద్దేవా చేశారు. 

అయితే పరాజయాన్ని తట్టుకోలేక, స్థానిక సంస్థల ఎన్నికలనూ బిజెపి అపహాస్యం చేసిందని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. అధికార బలాన్ని వినియోగించుకుని, ఓటర్లను బెదిరించి , పోలింగ్ శాతాన్ని తగ్గించి గెలిచిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని గేలిచేసినట్లే అని మండిపడ్డారు.