ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం మృతి

భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్ర రెడ్డి (85) చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  కన్నుమూశారు. అనారోగ్యానికి గురై కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 

తరచూ కరవు కాటకాలకు.. వర్షాలు బాగా కురిస్తే అతివృష్టి.. లేదంటే కరవు కాటకాలతో సతమతం అవుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కంటే పూర్తిగా వెనుకబడి ఉన్న రాయలసీమ సాగునీరు, తాగునీటి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. కరవు ప్రాంతాల్లో బీజేపీ పార్టీ జెండాతో ఉద్యమించి బక్కచిక్కిన కరవు రైతుల జీవితాల్లో ఆశలు రేపారు. 

సీమ ప్రాజెక్టుల అత్యవసర పరిస్థితిని ఎత్తి చూపారు. పాలకులు గుర్తించేలా తనవంతు కృషి చేశారు. అంతేకాదు ముఠా కక్షలకు నిలయమైన రాయలసీమలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా శాంతి కుసుమాలు వెలసిల్లేలా చేసేందుకు మరో కీలకమైన ఉద్యమం నిర్వహించారు. ఆయనకు కుమారుడు ఈశ్వర్‌ప్రసాద్, కుమార్తెలు దాక్షాయణి, మాధవి ఉన్నారు. 1959–64 వరకు మంగళం సర్పంచ్‌గా, 1982–87 వరకు పిచ్చాటూరు సమితి అధ్యక్షుడిగా, 1999–2004 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా, రైతు కమిషన్‌ మెంబర్‌గా విధులు నిర్వహించారు

ఫ్యాక్షన్ కు మూలమైన తుపాకుల లైసెన్సులను రద్దు చేస్తే తప్ప నాయకుల ఆగడాలు, అరాచకాలు ఆగవని గుర్తించి ఉద్యమాన్ని కొనసాగించారు. తన సొంత సామాజికవర్గం వారి నుండే తీవ్ర వ్యతిరేకత ఎదురైనా  పట్టించుకోకుండా ఫ్యాక్షన్ బాధితుల్లో ఆశలు చిగురింప చేశారు. సాగునీటి ఉద్యమంతో  రాయలసీమ ముఖద్వారంలోని రైతులకే కాదు.. ఫ్యాక్షన్ అంతానికి చేసిన పోరాటంతో సామాన్యులందరి నుంచి జేజేలు అందుకున్నారు. 

చిత్తూర్ జిల్లా విజయపురి మండలం మంగళం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంభంలో జన్మించారు. కాంగ్రెస్ (ఓ)తో  రాజకీయ ప్రయాణం ప్రారంభించి, పార్టీ ఆవిర్భావం నుండి జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ, బిజెపి ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుండి, రాష్ట్ర అధ్యక్ష పదవి వరకు పలు కీలక పదవులలో పార్టీ  అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారు. 

ఆయన  అధ్యక్ష స్థానం లోనే అనంతపూర్ జిల్లా  కదరి ఎమ్మెల్యే,  ధర్మవరం మునిసిపల్ చైర్మన్, నలుగురు కౌన్సిలర్లు  గెలుపొంది రాయలసీమలో బిజెపి ఒక గుర్తింపు తెచ్చుకొంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రాష్ట్ర బిజెపి కార్యాలయ స్థలం సేకరణ, భవన నిర్మాణం ఆయన సారథ్యంలోనే చేపట్టారు. 

చిలకం రామచంద్రారెడ్డి మృతి పట్ల ఏపీ బీజేపీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవిల్ నరసింహారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి, జాతీయ కార్యదర్శి  సత్యకుమార్, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్,,రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, సీఎం రమేష్ తతదితరులు చిలకం సేవలను గుర్తు చేసుకున్నారు. 

బీజేపీ ఉనికే లేని రోజుల్లో పార్టీ భవిష్యత్తును ఊహించి పోరాటం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఊపిరి ఊదే ప్రయత్నం చేశారని వారు కొనియాడారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఏ కష్టమొచ్చినా అండగా నిలిచేవారని, వారి మరణం భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా వ్యక్తిగతంగా తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.

చిలకం రామచంద్రారెడ్డి ఆకస్మిక మరణం పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 1981లో సమితి ప్రెసిడెంటుగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికై ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. 

సౌమ్యుడిగా, మంచితనానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, పార్టీలో అనేక పదవులు చేపట్టినా వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. నీతి నిజాయితీతో పని చేసే విధంగా కార్యకర్తలను తయారు చేశారని తెలిపారు. 

నిరాడంబరంగా జీవిస్తూ పార్టీ కార్యాలయాన్నే తన నివాసంగా చేసుకుని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాయలసీమలో రైతులతో కలిసి పాదయాత్ర చేసిన చిలకం రామచంద్రారెడ్డి మరణం బీజేపీకి తీరనిలోటు అని పేర్కొన్నారు.