రాజకీయంగా గడ్డు … అందుకే ఏపీపై కేసీఆర్ జల పోరాటం!

రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి పరోక్షంగా సహకారం అందించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అకస్మాత్తుగా రెండు రాష్ట్రాల మధ్య సమానంగా నీటి పంపకాలు జరగాలని అంటూ ఏపీపై జల పోరాటంకు కాలుదువ్వుతున్నారు. ఏపీ నీళ్ల దోపిడీ చేసుందని, తెలంగాణకు అన్యాయం జరిగిపోతున్నదని అంటూ మంత్రులతో నిత్యం విమర్శలు నిప్పులు చెరిగిస్తున్నారు. 

‘ఏపీ సీఎం జగన్​ గొప్పోడు..’ అంటూ జగన్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అంతెత్తు పొగిడిన కేసీఆర్​.. ఇప్పుడు వైఎస్​ను మించిన గజదొంగ జగన్​ అంటూ మంత్రులతో తిట్టిస్తున్నారు. ‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు… కలిసికట్టుగా నీళ్లను పంచుకుందాం..’ అని రెండు రాష్ట్రాలకు తానే పెద్దన్న అన్నట్లు చెప్పుకొచ్చిన కేసీఆర్​.. ఇప్పుడు తప్పు మొత్తం ఏపీపై నెట్టేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.

గోదావరి నీళ్లను తరలించి రాయలసీమను సస్య శ్యామలం చేస్తామని తిరుపతి పర్యటనకు వెళ్లినప్పుడు మాట ఇచ్చిన కేసీఆర్..​ ఇప్పుడు ఏపీ సర్కారుపై మండిపడాలని మినిస్టర్లను ఎగేస్తున్నారు. గోదావరి‌‌ నీళ్లను కృష్ణాకు లింక్​ చేస్తూ ఉమ్మడి ఎత్తిపోతల ప్రాజెక్టు కడుతామంటూ ఏపీ సీఎం జగన్​తో భేటీ అయిన కేసీఆర్​.. ఇప్పుడు కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకుపోతోందంటూ మంత్రులతో పోరాటం చేయిస్తున్నారు.

ఇప్పుడే తనకు ఏపీ అక్రమ ప్రాజెక్ట్ ల గురించి తెలిసిన్నట్లు ప్రజలను నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా, ప్రజలలో ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టమైనప్పుడల్లా, ఎన్నికలు ఎదురైనప్పుడల్లా తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ రగిలించడం కోసం ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చేరగడం కేసీఆర్ కు ఆనవాయితిగా వస్తున్నది. 

ఏపీలో జగన్​ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయనకు, కేసీఆర్​కు మధ్య దోస్తానా కుదిరింది. 2019 మేలో ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వెళ్లారు. వైఎస్ అద్భుతమైన వారసత్వాన్ని కొనసాగించాలని ఆయనకు కేసీఆర్​ మార్గనిర్దేశం చేశారు. తర్వాత రెండు మూడు సార్లు ఇద్దరు సీఎంల మధ్య చర్చలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్​ హాజరయ్యారు.  

తామిద్దరం మంచి అవగాహనతో ఉన్నామని, జగన్ నిజాయితీపరుడని, గోదావరి జలాలు, కృష్ణా జలాలు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం మెట్ట ప్రాంతాలకూ అందించాలని స్వయంగా కేసీఆర్  ప్రకటించారు. రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల నీళ్ల గొడవపై ఇక కేంద్ర ప్రభుత్వం  జోక్యం చేసుకునే దుర్గతి ఉండదని కేసీఆర్ తేల్చేశారు. ఇప్పుడు అదే నీళ్ల లొల్లి రేపి.. జగన్​ దొంగ అని మంత్రులతో మాట్లాడిస్తున్నారు. 

ఏపీ అక్రమ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిన సమయం​లోనే కేంద్ర ప్రభుత్వం అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​కు ఆహ్వానించింది. తెలంగాణ తరఫున ప్రభుత్వ వాదన వినిపించి ఏపీ టెండర్లను కట్టడి చేసేందుకు అసలు సిసలైన వేదికను వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డుమ్మా కొట్టింది.

2020 ఆగస్టు 5న కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​కు పిలువగా.. కొత్త సెక్రటేరియట్​ నిర్మాణంపై చర్చించేందుకు కేబినెట్​ మీటింగ్​ ఉందనే సాకుతో అపెక్స్​ మీటింగ్​ను  వాయిదా వేయాలని కేసీఆర్​  కోరారు. దీంతో టెండర్లు పూర్తి చేసేందుకు పరోక్షంగా ఏపీకి సహకరించినట్లయింది. అదే నెల 19న రాయలసీమ లిఫ్ట్ టెండర్లకు గడువు పూర్తింది.

అపెక్స్ మీటింగ్ 5నే జరిగి కేసీఆర్ దీనిపై మాట్లాడి ఉంటే ఏపీ అక్రమ ప్రాజెక్టులను ప్రస్తావించి అడ్డుకునే అవకాశం ఉండేది. కానీ.. అడ్డుకునే ఆలోచన కేసీఆర్​కు లేదని.. ఈ మీటింగ్​ వాయిదా వేయించుకోవటంతో మరోసారి బయటపడింది. పాలమూరు ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం పదేపదే బయటపడడం, ఇటు హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో కేసీఆర్ కు సెగ తగిలింది.

దీంతో ఇప్పుడే ఏపీ అక్రమ ప్రాజెక్టులు గుర్తుకొచ్చినట్లు డ్రామా మొదలుపెట్టారు. ఏడాదిన్నరగా శిలా విగ్రహాల్లా ఉన్న మంత్రులతో ఒకరొకరిగా స్క్రిప్టులు చదివించడం మొదలుపెట్టారు. ఫొటోలు బయటపెట్టిన ఏడు నెలల తర్వాత ఇప్పుడు ‘మాకు ఫొటోలు దొరకడం లేటైంది. అందుకే కంప్లెయింట్ చేయలేకపోం’ అని ఉత్తర తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్లు ఈ మధ్యే తమకు తెలిసిందని ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్  జగన్ కుతంత్రాలకు జనాన్ని బలిచేసే కుట్రకు తెరతీశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా అటూ ఇటూ మంత్రులు మాట్లాడడం మొదలుపెట్టారు. లంకలో పుట్టినోళ్లు రాక్షసులని, ఆంధ్రోళ్లు ఎవరూ తెలంగాణకు మంచి జరగాలని కోరుకోరని మంత్రి ప్రశాంత్ రెడ్డి రెచ్చగొడుతున్నరు.

తెలంగాణ వచ్చినప్పటి నుంచీ కృష్ణా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉన్న నిధులన్నీ కాళేశ్వరం వైపు మళ్లించి, కేసీఆర్​ ఫామ్​హౌస్​  వరకు గోదావరి నీళ్లను ఎత్తిపోసేందుకు రూ. లక్ష కోట్లకు పైగా అప్పులు చేసింది. ఆ సమయం​లో దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

కృష్ణాకు ఆశించిన వరద రావటం లేదని, అవసరమైతే గోదావరి నీళ్లను శ్రీశైలం వరకు తీసుకెళ్లే భారీ లిఫ్ట్ ప్రాజెక్టు కడుతామంటూ రెండేండ్ల కిందట మాస్టర్​ ప్లాన్​ వేసింది కేసీఆరే.  ప్రగతి భవన్​లో ఏపీ సీఎం జగన్ తో భేటీ  సందర్భంగా ఈ ప్రాజెక్టుపై ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. సాధ్యాసాధ్యాల రిపోర్టును తయారు చేయాలని  రెండు రాష్ట్రాల ఇరిగేషన్​ ఇంజనీర్లను ఆదేశించారు. 

రెండు భేటీలు జరిగాక, ఈ ప్రాజెక్టు డిజైన్లు కుదరక ఏపీ నో చెప్పింది. రూ. 50 వేల కోట్లతో కట్టాలనుకున్న ఈ ప్రాజెక్టును రెండు ప్రభుత్వాలకు ఉమ్మడి దోస్తీ మేఘా కంపెనీకే ఇద్దామనుకున్నారు. మన ప్రాంత భూములను ముంచి, మన నిధులతో గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లిస్తే తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నకు రాష్ట్ర సర్కారు నుంచి సమాధానం లేదు.