టీకాలపై ఇంత నిస్సిగ్గుగా విమర్శలా?

వ్యాక్సినేషన్ ప్రక్రియపై విమర్శలు చేస్తున్న పార్టీలపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అయితే ఏ ఒక్క పార్టీ పేరును గానీ, నేతల పేర్లు గానీ ప్రస్తావించకుండా విరుచుకుపడ్డారు. ఆయా రాష్ట్రాల నేతలు భయాన్ని సృష్టించే బదులు, ఆలోచనలపై దృష్టి సారిస్తే బాగుంటుందని చురకలంటించారు.
ఇప్పటికీ వ్యాక్సినేషన్ సరఫరా విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే.. దానికి ఆయా రాష్ట్రాలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘‘వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో కొందరు నేతలు ఇష్టరీతిన, బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడాన్ని గమనిస్తూనే ఉన్నాను. ప్రజలు వాటి అంతరార్థాన్ని గమనిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
కేంద్రం 75 శాతం వ్యాక్సిన్లను ఉచితంగా అందించిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. జూన్‌లో 11.50 కోట్లకు చేరుకుంది. వ్యాక్సినేషన్ విషయంలో సరైన ప్రణాళికను రూపొందించుకోండని రాష్ట్రాలకు సూచించారు. వ్యాక్సినేష‌న్ గురించి వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని ఆయ‌న కోరారు.
మహమ్మారి సమయంలోనూ వ్యాక్సినేషన్ విషయంలో రాజకీయాలు చేస్తున్నారు. ఇది నీతిమాలిన చర్య. విమర్శలపై దృష్టిసారించే బదులు, ప్రణాళికపై దృష్టి నిలపండి అంటూ హర్షవర్ధన్ ధ్వజమెత్తారు. ఒక‌వేళ వ్యాక్సినేష‌న్ గురించి తెలియ‌క‌పోతే, వాళ్లు ప‌రిపాల‌న‌పై ఫోక‌స్ చేయాల‌ని సూచించారు. ఆందోళ‌న సృష్టించ‌డం క‌న్నా ప్ర‌ణాళిక‌లు వేయ‌డంపై స‌మ‌యం కేటాయించాల‌ని హితవు చెప్పారు. ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు కూడా అధిక సంఖ్య‌లో టీకాలు కేటాయించ‌నున్న‌ట్లు మంత్రి త‌న ట్వీట్‌లో చెప్పారు.
కాగా, బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, ర‌బ్రీ దేవి క‌రోనా వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేద‌ని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ప్ర‌శ్నించారు. తేజ‌స్వి యాద‌వ్‌, తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్‌లు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తీసుకోవ‌డం ప‌ట్ల సుశీల్ మోదీ ఆక్షేపించారు. ర‌ష్యా వ్యాక్సిక్ స్పుత్నిక్ వీ భార‌త్‌కు వ‌చ్చే వ‌ర‌కూ ఇద్ద‌రు సోద‌రులూ వేచిచూశార‌ని వారికి దేశీ వ్యాక్సిన్ ప‌ట్ల విశ్వాసం లేద‌ని ఆరోపించారు. ఆర్జేడీ నేత‌లు గ‌తంలోనూ కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ సామ‌ర్ధ్యాన్ని ప్ర‌శ్నించార‌ని గుర్తు చేశారు.