మోడెర్నా టీకా దిగుమ‌తికి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

భారత్ కు మ‌రో విదేశీ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌స్తోంది. అమెరికా కంపెనీ మోడెర్నా త‌యారు చేసిన వ్యాక్సిన్ దిగుమ‌తి, అత్య‌వ‌స‌ర వినియోగానికి  డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 
 
ముంబైలోని ఫార్మాసూటిక‌ల్ కంపెనీ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను భారత్ కు  దిగుమ‌తి చేసుకోనుంది. అయితే పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. టీకా పంపిణీ చేపట్టిన తరువాత తొలి 100 మంది లబ్ధిదారులకు సంబంధించి ఏడు రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించ వలసి ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 
 
సోమ‌వార‌మే ఈ సంస్థ దీనికోసం డీసీజీఐ అనుమ‌తి కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. మోడెర్నా అనేది మెసెంజ‌ర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) వ్యాక్సిన్‌. ఇది కరోనాపై 90 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేలింది. భారత్ లో క‌రోనా వైర‌స్ కోసం అత్య‌వ‌స‌ర అనుమ‌తి పొందిన నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా. ఇప్ప‌టికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వి ల‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.
 
ఇలా ఉండగా, స్పుత్నిక్ వి టీకా మార్కెట్లోకి రాడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. టీకాల దిగుమతి, క్వాలిటీ టెస్టింగ్, ఆలస్యం కావడం వల్ల ఈ టీకాలను మార్కెట్లోకి విడుదల చేయడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం పైలట్ దశలో ఈ టీకాలను కొన్ని నగరాల్లో అందిస్తున్నారు. 28 నగరాలకు ఈ టీకాను అందుబాటు లోకి తేడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రయత్నిస్తోంది. ఆడినోవైరస్ ద్వారా తయారయ్యే ఈ టీకా రెండు డోసుల్లో తేడా ఉంటుంది. 21 రోజుల వ్యవధిలో ఈ రెండు డోసులను ఇవ్వాల్సి ఉంది. 
 
బహుశా రెండు వేర్వేరు డోసులు రాని కారణంగా పంపిణీ ఆలస్యం అవుతున్నట్టు భావిస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాలను భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.