జీఎస్‌టీతో పన్ను రేట్లు తగ్గాయి

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల పన్ను రేట్లు తగ్గాయని, ఇది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ నిబంధనలను పాటించడం సరళమైందని పేర్కొంది. జీఎస్‌టీ విధానాన్ని ప్రవేశపెట్టి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా ఈ వివరాలను బుధవారం వెల్లడించింది. 17 రకాల స్థానిక పన్నులను రద్దు చేసి జీఎస్‌టీని 2017 జూలై 1న దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఎక్సయిజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి పన్నులను తొలగించి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. పన్ను చెల్లింపుదారులంతా పాటించేందుకు అనువుగా జీఎస్‌టీ విధానం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా వ్యాపార వర్గాలకు లబ్ధి చేకూర్చే అనేక వివరణలను జీఎస్‌టీ కౌన్సిల్ సిఫారసు చేసినట్లు తెలిపింది.

జీఎస్‌టీ విధానంలో వార్షిక టర్నోవరు రూ.40 లక్షల వరకు ఉన్న వ్యాపారాలను  పన్ను పరిధి నుంచి మినహాయించినట్లు తెలిపింది. వార్షిక టర్నోవరు రూ.1.5 కోట్ల వరకు ఉన్న వ్యాపార సంస్థలు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించినట్లు, దీనిని ఎంపిక చేసుకున్నవారు కేవలం 1 శాతం పన్ను మాత్రమే చెల్లించేందుకు వీలు కల్పించినట్లు తెలిపింది.

రూ.20 లక్షల వరకు వార్షిక టర్నోవరుగల సేవ, వ్యాపార సంస్థలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. సంవత్సరానికి రూ.50 లక్షల వరకు టర్నోవరు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకుని, కేవలం 6 శాతం పన్ను మాత్రమే చెల్లించవచ్చునని పేర్కొంది.

చిన్నతరహా పన్ను చెల్లింపుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వార్షిక రిటర్నులు, వాటిని దాఖలు చేసే విధానాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ సరళతరం చేసిందని తెలిపింది. 2017-18, 2018-19, 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో రూ.2 కోట్ల వరకు వార్షిక టర్నోవరు కలిగిన చిన్నతరహా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల దాఖలును ఐచ్ఛికం (ఆప్షనల్) చేసినట్లు తెలిపింది.

జీఎస్‌టీ అటు వినియోగదారులకు, ఇటు పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉందని ఇప్పుడు విస్తృతంగా ధ్రువపడిందని పేర్కొంది. రెవిన్యూ న్యూట్రల్ రేటు ఆర్ఎన్ఆర్ కమిటీ సిఫారసు ప్రకారం 15.3 శాతం అని, అయితే భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుత వెయిటెడ్ జీఎస్‌టీ రేటు 11.6 శాతమేనని వివరించింది.

పరోక్ష పన్నుల విధానంలోని అత్యంత సంక్లిష్టమైన పద్ధతిని జీఎస్‌టీ మార్చిందని తెలిపింది. ప్రతి రాష్ట్రంలోనూ వ్యాపారం చేయాలనుకునే సంస్థ 495 వేర్వేరు సబ్మిషన్స్ చేయవలసి వచ్చేదని, ఇప్పుడు ఈ సబ్మిషన్స్ సంఖ్య కేవలం 12కు తగ్గినట్లు వివరించింది. ఈ నాలుగేళ్ళలో 66 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఓ మైలురాయి వంటిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జీఎస్‌టీ వల్ల సామాన్యులపై పన్నుల భారం తగ్గిందని, దీనికి అనుగుణంగా నడచుకోవడం సరళతరం అయిందని తెలిపారు. పారదర్శకత, అనుగుణంగా నడచుకోవడం, వసూళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు వివరించారు. జీఎస్‌టీ అమలుకు నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన బుధవారం ఈ విధానాన్ని ప్రశంసించారు.