వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపు!

కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను సరైన పద్దతిలో వినియోగించుకుంటే రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ ఏజెన్సీ బయాన్‌ అండ్‌ కంపెనీ వెల్లడించింది.

కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి రావడం వల్ల సాగు విధానాల్లో మార్పులు, నూతన సాంకేతికత జోడింపులో వేగం పెరుగుతాయని,  ఫలితంగా అగ్రిటెక్‌ రంగంలో ఉన్న కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తాయని అంచనా వేసింది. 2025 నాటికి అగ్రిటెక్‌ రంగంలోకి 30 నుంచి 35 బిలియన్ల పెట్టుబడులకు అవకాశం ఉందని లెక్కకట్టింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అగ్రిటెక్‌ పెట్టుబడుల విలువ కేవలం ఒక బిలియన్‌ డాలర్లుగా ఉంది.

అగ్రిటెక్‌లోకి భారీగా పెట్టుబడులు రావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, అమ్మకం వంటి రంగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేసింది. ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ఫ్లాట్‌ఫామ్స్‌, ఇంక్యుబేషన్‌ వింగ్స్‌, న్యూ బిజినెస్‌ మోడల్స్‌ అందుబాటులోకి వస్తాయని తెలిపింది. 

అదే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కొనుగోలులో ప్రస్తుతం అమలవుతున్న పద్దతుల స్థానంలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా కొత్త పద్దతులు అమల్లోకి వస్తాయంటూ బయన్‌ అండ్‌ కంపెనీ అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో వచ్చే ఈ మార్పులతో రైతుల ఆదాయం రాబోయే రోజుల్లో రెండింతలు అయ్యే అవకాశం ఉందని బయాన్‌ సూచించింది. 

వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లకు ఆర్థిక నిధులు అందించే దేశాల్లో భారత్  మూడో స్థానంలో ఉందని, కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే స్టార్ట్‌అప్‌లకు మరింత తోడ్పాటు అందుతుందని  బయాన్‌ కంపెనీ చెప్పింది. వ్యవసాయ రంగానికి టెక్నాలజీ తోడై రాబోయే ఇరవై ఏళ్లలో సాగు రంగంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా టాప్‌  మేనేజ్‌మెంట్‌ కంపెనీ వెల్లడించింది.