చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ అంశంపై ట్విట్టర్ పై మరో కేసు

సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్‌ మరో చిక్కులో పడింది. చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ అంశంపై ఢిల్లీలో కేసు నమోదైంది. నూతన ఐటి చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం, ట్విట్టర్‌ మధ్య వార్‌ నడుస్తున్నప్పటి నుండి సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థపై నమోదైన నాల్గవ కేసు ఇది కావడం గమనార్హం. 

పోస్కో చట్టం, ఐటి చట్టం కింద తాజా కేసు నమోదైంది. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సిపిసిఆర్‌) ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్‌ సెల్‌ కేసు నమోదు చేసింది. పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు నిరంతరం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులో ఎన్‌సిపిసిఆర్‌ తెలిపింది. 

గతంలో ఇదే అంశంపై సైబర్‌ సెల్‌తో పాటు ఢిల్లీ పోలీసులకు కమిషన్‌ రెండు లేఖలు రాసింది. సైబర్‌ సెల్‌ సీనియర్‌ అధికారిని జూన్‌ 29న హాజరు కావాలని ఆదేశించింది. ఘజియాబాద్‌ ఘటనపై ట్విట్టర్‌పై ఈ నెల మొదట్లో కేసు నమోదైన సంగతి విదితమే. 

అయితే కర్ణాటక హైకోర్టు ట్విట్టర్‌ ఇండియా చీఫ్‌ మనీష్‌ మహేశ్వరికు అరెస్టుల నుండి తాత్కాలిక రక్షణ కల్పించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా జమ్ముకాశ్మీర్‌ను భారత పటంలో తప్పుగా చూపినందుకు యుపిలో కేసు నమోదైంది. ఇదే ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో మరో కేసు దాఖలైంది.