మమతా ఆరోపణలను తిప్పికొట్టిన గవర్నర్ ధ‌న్‌క‌ర్‌

ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి మ‌ధ్య మాట‌ల యుద్ధం శ్రుతితప్పుతున్న‌ది. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఒక అవినీతిప‌రుడ‌ని, 1996 నాటి హ‌వాలా జైన్ కేసులో ఆయ‌న‌పై చార్జిషీట్ దాఖ‌లైంద‌ని, ఇప్ప‌టికీ కేసు పెండింగ్‌లో ఉన్న‌ద‌ని మ‌మ‌తాబెన‌ర్జి చేసిన ఆరోప‌ణ‌లను గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ తిప్పికొట్టారు. 

త‌న‌పై ఎలాంటి కేసులు లేవ‌ని స్ప‌ష్టంచేశారు. ‘మీ గ‌వ‌ర్న‌ర్‌పై ఎప్పుడూ చార్జిషీట్‌లు దాఖ‌లు కాలేదు. అలాంటి డాక్యుమెంట్‌లు ఏవీ లేవు. ఇది పూర్తిగా త‌ప్పుడు స‌మాచారం’ అని ఆయన తేల్చి చెప్పారు.

పైగా, ఒక సీనియ‌ర్ నాయ‌కురాలు (మ‌మ‌తాబెన‌ర్జి) ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తార‌ని తాను ఊహించ‌లేదని ఆవేదన వ్యక్తం చేశారు. `నేను హవాలా కేసుకు సంబంధించి ఏ కోర్టు నుంచి కూడా స్టే తీసుకోలేదు. ఎందుకంటే నాపై ఎలాంటి కేసులు లేవు కాబ‌ట్టి’ అని ధ‌న‌క్‌ర్ వ్యాఖ్యానించారు.

‘గ‌వ‌ర్న‌ర్ ఒక అవినీతి మ‌నిషి. 1996 నాటి హ‌వాలా జైన్ కేసులో గ‌వ‌ర్న‌ర్‌పై చార్జిషీట్ దాఖ‌లైంది. ఈ కేసులో ద‌ర్యాప్తుపై ధ‌న్‌క‌ర్ స్టే తెచ్చుకున్నారు. ఇప్ప‌టికీ అయ‌న‌పై కేసు పెండింగ్‌లో ఉన్న‌ది. ఈ కేసు వెలుగుచూసిన స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌హించిన ఓ వ్య‌క్తి నాకు సంబంధిత డాక్యుమెంట్ల‌ను పంపించాడు’ అని మ‌మ‌తా బెన‌ర్జి  అంతకు ముందు విలేక‌రుల స‌మావేశంలో ఆరోపించారు.

ఎన్నికల అనంతరం మమతా ప్రభుత్వ నిష్క్రియత్వం ఎమర్జెన్సీ సమయంలో నిరంకుశత్వం, ప్రజాస్వామ్య విలువల పాతర, మీడియా స్వేచ్ఛను హరించి వేయడాన్ని స్ఫురణకు తెస్తుంది అంటూ గవర్నర్ ట్వీట్ చేసిన మరుసటి రోజు మమతా ఈ  ఆరోపణలు చేయడం గమనార్హం.