పుదుచ్చేరి మంత్రివర్గంలో 40 ఏళ్ళ తర్వాత ఒక మహిళ

పుదుచ్చేరి మంత్రివర్గంలో దాదాపు 40 ఏండ్ల త‌ర్వాత తొలిసారి ఒక మ‌హిళ‌కు స్థానం ల‌భించింది. 1980-1983 మ‌ధ్య‌ కాంగ్రెస్‌–డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన మ‌హిళా నాయ‌కురాలు రేణుక అప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పుదుచ్చేరిలో  మహిళలకు మంత్రి పదవి దక్కలేదు. 

తాజాగా రంగ‌స్వామి మంత్రివర్గంలో మ‌హిళ‌కు చోటుద‌క్కింది. కారైక్కాల్‌ ప్రాంతంలోని నెడుంగాడు రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకని మంత్రి పదవి వ‌రించింది. 

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు 52 రోజుల తర్వాత త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. 

ఆయన కరోనా బారిన పడడం, ఆ తదుపరి పరిణామాలతో కొత్త మంత్రివర్గం కొలువులో జాప్యం నెలకొంది. ఆదివారం సాయంత్రం పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం జ‌రిగింది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ వారి చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. 

తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నమశ్శివాయంతో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత లక్ష్మీనారాయణన్, బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణన్‌ కుమార్‌కు, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన తేని జయకుమార్, చంద్ర ప్రియాంక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం అరగంటలో  ముగించారు. దీన్ని డీఎంకే బహిష్కరించింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన బీజేపీ ఎమ్మెల్యే జాన్‌ కుమార్‌ ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం.విద్యావంతురాలైన చంద్రప్రియాంక మాజీ మంత్రి చంద్రకాశి కుమార్తె కావడం గమనార్హం.