మొక్కలతోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి!

చూస్తుంటే కేసీఆర్ తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని కేవలం మొక్కలతోనే సరిపెట్టేలా కనిపిస్తోందని సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ ప్రగల్భాలేనని గురించి గతంలో తాను చెప్పినట్టే జరుగుతోందని ఆమె ధ్వజమెత్తారు. 

 ‘‘తెలంగాణలో గ్రామాలు, పట్టణాలు పర్యటించి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధిస్తానంటూ కేసీఆర్ గారు చెప్పేవన్నీ ప్రగల్భాలేనని నేను ఇంతకు ముందు చెప్పినట్టే జరుగుతోంది. ఒకవేళ బుద్ధి పుట్టి ఎక్కడికైనా వెళ్ళినా వాసాలమర్రి తరహాలో సామూహిక భోజనాలు చేసి రావడం… వరంగల్ మాదిరిగా నిరసనలను ఎదుర్కోవడం తప్ప ఒరిగేదేమీ లేదు” అంటూ ఆమె విరుచుకు పడ్డారు. 

తాజాగా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ గారు జులై నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రారంభించాలని, హరితహారం కోసం ఇంటింటికీ 6 మొక్కలు నాటించాలని ఆదేశించారని ఆమె గుర్తు చేశారు. 

తెలంగాణలో విపరీతంగా పంటలు పండి, దేశ ధాన్యాగారంగా మారిందని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఆమె ప్రశవిస్తూ పంటలు పండినా… తెలంగాణ రైతు మాత్రం కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర లేక ఆ పంటలకు మంటలు పెట్టుకుంటున్న దుస్థితి చూస్తూనే ఉన్నాం అని ఆమె దుయ్యబట్టారు. 

ఇదంతా ఒకవైపు అయితే… తాజాగా దళిత సాధికారత కోసమంటూ అఖిలపక్షం ఏర్పాటు చేశారు. సారుకు ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తుకొచ్చాయి. కేవలం హుజురాబాద్ ఉపఎన్నికల కోసమే సీఎం గారు ఈ ప్రగతులు, సాధికారతల పాట పాడుతున్నారన్నది సుస్పష్టం అని విజయశాంతి విమర్శించారు. 

ఎన్నికలు దగ్గరకొచ్చినప్పుడు మాత్రమే ఆర్భాటాలు చేసే ఈ సారు తీరు తెలుసు గనుకే బీజేపీ ఈ అఖిల పక్షాన్ని బహిష్కరించిందని ఆమె ట్వీట్ లో స్పష్టం చేశారు.