గాంధీ భవన్ మెట్లెక్కను…. కోమటి రెడ్డి శపధం!

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం చాలాకాలంగా విశేష ప్రయత్నం ఆ పదవికి  ఎ రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేశారు.  ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని, టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలవద్దని సంచలన వాఖ్యలు చేశారు. 

పైగా, ఇప్పుడు అది టీపీసీసీకాదని, టీడీపీ పీసీసీగా మారిందని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ ఎన్నిక జరిగిందని విమర్శించారు. పీసీసీని ఇంఛార్జి అమ్ముకున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. ఓటుకు  నోట్ కేసులు అప్పుడు టిడిపి శాసనసభ పక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి మొదటి నిందితుడు కావడం తెలిసిందే. 

కాంగ్రెస్ కొత్త కార్య‌వ‌ర్గాన్ని అభినందిస్తూ వారి నాయ‌క‌త్వంలో రాబోయే హుజూరాబాద్‌ ఉపఎన్నిక‌ల్లో డిపాజిట్ తెచ్చుకోవాల్సిందిగా సవాల్ చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు త‌న‌ని కలవద్దని అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డికి సూచించారు.  కాంగ్రెస్ పార్టీ కూడా టీ టీడీపీ మాదిరిగానే మారబోతుంద‌ని, కార్యకర్తలకు ఇందులో గుర్తింపులేదని అంటూ తెలంగాణాలో ఇక కాంగ్రెస్ కు భవిష్యత్ లేదంటూ స్పష్టం చేశారు.

కాగా, తాను ఇబ్రహింపట్నం మొదలుకొని భువనగిరి వరకు పాదయాత్ర చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. ప్రజల మధ్యనే ఉంటూ కొత్త నాయకులను, కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తాన‌ని వెల్లడించాయిరు. న‌ల్ల‌గొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల గెలుపుకోసం కృషి చేయ‌నున్న‌ట్లు చెప్పారు. 

అదేవిధంగా పార్ల‌మెంట్‌లో త‌న గ‌ళం వినిపించ‌నున్న‌ట్లు తెలిపారు. తాను కార్యకర్త నుంచి పైకి వచ్చిన వాణ్ణి అని చెబుతూ ఇకపై తన రాజకీయ భవిష్యత్ ను కార్యకర్తలే నిర్ణయిస్తారన్నారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అయితే,  సోనియా, రాహుల్ గాంధీపై విమర్శలు చేయనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఏఐసీసీ ప్ర‌క‌టించిన నూత‌న టీపీసీసీ జాబితాలో ఏ స్థాయిలోనూ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పేరు లేని విష‌యం తెలిసిందే. టీపీసీసీ అధ్య‌క్ష బ‌రిలో, కాబోయే టీపీసీసీ ప్రెసిడెంట్ అంటూ విస్తృత ప్ర‌చారం జ‌రిగిన నేప‌థ్యంలో క‌నీసం అటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్స్ జాబితాలోనూ ఇటు సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్స్ జాబితాలోనూ ఆయ‌న‌కు చోటు ద‌క్క‌ని వైనం నెల‌కొంది.

కాగా, పిసిసి ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవికి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే, పార్టీలో మాత్రం కొనసాగుతానని లేఖలో స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ను ప్రకటించిన కొద్దిసేపటికే మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఎఐసిసి సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ పంపిన సంగతి తెలిసిందే.