జమ్మూలో డ్రోన్ తో ఉగ్రదాడిపై కేంద్రం సీరియస్ 

జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై ఉగ్రవాదులు పేలుళ్లతో దాడికి పాల్పడిన ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.   దొడ్డిదారిలో సరిహద్దుల గుండా భారత్‌లోకి చొచ్చుకువచ్చి తరుచూ దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు పంథా మార్చుకొని డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత సాయంతో  దాడులు జరపడం, పైగా వైమానిక దళ స్టేషన్ పై జరగడం కలవరంకు దారితీస్తుంది. 
 
కొంత కాలంగా సరిహద్దులో కాల్పుల విరమణ అమలులో ఉండగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్ ల సహాయంతో ఆయుధాలు వదులుతూ, దాడులకు పాల్పడుతూ ఉండడంతో భారత భద్రతా దళాలు అప్రమత్తం అవుతున్నాయి. దానితో విమానాశ్రయాల వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నారు. 
 
శనివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన రెండు డ్రోన్లు ఆరు నిమిషాల వ్యవధిలో వాయుసేన స్థావరం మీదకు పేలుడు పదార్థాలను (ఐఈడీ) జారవిడిచినట్టు అధికారులు తెలిపారు. తొలి బాంబు దాడిలో సత్వారీ ఏరియాలోని హై-సెక్యూరిటీ టెక్నికల్‌ ఏరియాలోని ఒక బిల్డింగ్‌ పైకప్పు దెబ్బతినగా, రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగినట్టు చెప్పారు. 
 
ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన అధికారులు స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు. భారత్‌లో జరిగిన తొలి డ్రోన్‌ దాడి ఇదేనని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. 
 
జమ్మూ పేలుళ్ల ఘటనపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణను తీవ్రం చేయగా, దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు అప్పగించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్ఐఏ బృందంతో పాటు పలు కేంద్ర నిఘా ఏజెన్సీల బృందాలు అక్కడకు చేరుకొని ప్రాధమిక సమాచారం సేకరిస్తున్నాయి.
ఘటన జరిగిన స్థలం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఎయిర్ ‌బేస్‌కు రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఉగ్రవాదులు డ్రోన్లతో ఈ దాడి జరిపినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఎయిర్ స్టేషన్‌లో నిలిపి ఉంచిన హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదాలు దాడికి దిగారని, అయితే ఉగ్రవాదుల గురితప్పిందని నిపుణులు చెబుతున్నారు.
కాగా పేలుళ్లలో ఆయుధ సామగ్రి, చాపర్లకు ఎలాంటి నష్టం జరుగలేదని వాయుసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. జమ్ములో దాడి నేపథ్యంలో పంజాబ్‌ సరిహద్దుల్లోని పఠాన్‌కోట్‌లో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు.వాయుసేన స్థావరంలో జరిగిన దాడి ఉగ్రవాదుల పనేనని జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ చీఫ్‌ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు. 
 
దాడి వెనుక ఎవరున్నారన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబా లేదా జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలు ఉండొచ్చని భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) బిల్డింగ్‌, విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఎంఐ17 చాపర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ డ్రోన్‌ దాడులు జరిగినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 
 
అయితే, కొన్ని కారణాల వల్ల టార్గెట్‌ మిస్‌ అయినట్టు వెల్లడించాయి. అయితే ఒక పేలుడు ఏటీసీకి కేవలం 100 మీటర్ల దూరంలోనే జరుగడం గమనార్హం. దాడికి పాల్పడిన డ్రోన్లలో ఒక డ్రోన్‌ 5 కిలోల టీఎన్‌టీ బాంబును కలిగి ఉన్నట్టు అధికారి ఒకరు తెలిపారు.
కాగా,  జమ్మూలోని ఓ రద్దీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలపెట్టిన భారీ దాడి కుట్రను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఆదివారంనాడు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ఒక ప్రాంతంలో ఉంచిన 5 నుంచి 6 కిలోల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. సకాలంలో పోలీసులు గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పింది. 
 
మరోవైపు పుల్వామాలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌ (ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంట్లోకి చొర‌బ‌డిన టెర్రరిస్టులు ఆయ‌న‌ను హ‌త్య చేశారు. కశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన మాజీ ఎస్పీఓ ఫయాజ్‌ అహ్మద్‌ పుల్వామా జిల్లాలోని అవంతీపొర సమీపంలోని హరిపరిగ్రామ్‌లో నివాసం ఉంటున్నారు. 
 
ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో అహ్మద్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్య రజా బేగమ్‌, కుమార్తె రఫియా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రజా బేగం మృతిచెందారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.