అనైక్యతతో యోగిని అడ్డుకోలేక పోతున్న ప్రతిపక్షాలు

మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర ప్రదేశ్ లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల మధ్య నెలకొన్న అనైక్యత కారణంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బిజెపి మరోమారు ఆ రాష్ట్రంలో విజయడంకా మ్రోగించడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

ముఖ్యంగా 2019 లోక్ సభ ఎన్నికలలో కూటమిగా పోటీచేసిన సమాజవాద్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఈ పర్యాయం ఎవ్వరికీ వారే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో కలసి పోటీ చేసిన సమాజవాద్ పార్టీ, కాంగ్రెస్ కూడా ఈ సారి ఎవ్వరి దారి వారిదిగా ఉన్నది. 2012లో వలె తిరిగి 224 సీట్లతో అధికారంలోకి రాగలమని ఆశలు పెంచుకున్న అఖిలేష్ కేవలం 47 సీట్లకు పరిమితం కావలసి వచ్చింది. 312 సీట్లతో బిజెపి అధికారంలోకి వచ్చింది. 

లోక్ సభ ఎన్నికల సందర్భంగా చేతులు కలిపినా ఎస్పీ, బీఎస్పీ తమ కూటమి `చరిత్రాత్మకం’ అంటూ అభివర్ణించుకున్నాయి. 2021లో రాష్ట్రంలో అధికారమలోకి రావడానికి ఇది మొదటి మెట్టుగా పేర్కొన్నాయి. అయితే ఎన్నికలలో ఘోర పరాజయం చెందడంతో వారి కలయిక వికరించింది. 

ఎస్పీ ఓట్లు బీఎస్పీకి బదిలీ అయినా, బీఎస్పీ ఓట్లు ఎస్పీకి బదిలీ కాకపోవడంతో ఈ కూటమికి ఒక మెట్టు దిగి వచ్చిన అఖిలేష్ యాదవ్ నివ్వెర పోవలసి వచ్చింది. 2017లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు సహితం ఇటువనీత్ అనుభవమే కలిగింది. దానితో 38 సీట్లకు పోటీ చేసిన బీఎస్పీ 10 సీట్లు గెల్చుకోగా, 37 సీట్లకు పోటీ చేసిన ఎస్పీ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెల్చుకొంది. 

లోక్ సభ ఎన్నికలలో పరాజయం అనంతరం ప్రధాన ప్రతిపక్షాలైన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ డీలాపడిపోయి ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో లభించిన విజయాలు వారిలో కొత్త ఆశలు నింపాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలో, యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖపూర్ ప్రాంతంలో బిజెపి వెనుకబడి ఉండడంతో అందరికన్నా ఎక్కువ స్థానాలు గెలుపొందిన ఎస్పీ రాష్ట్రంలో ఇక అధికారం తమదే అన్న ధీమాతో ఉంటూ వస్తున్నది. 

పైగా కరోనా రెండో వేవ్ ఉధృతం కావడంపై బీజేపీలోని కోన్ వర్గాలే ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, నాయకత్వం మార్పు అనే ఊహాగానాలు షికార్లు  చేయడం, బిజెపి అధిష్ఠానం కూడా రాష్ట్రంలోని పరిస్తితులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో `ప్రభుత్వ వ్యతిరేకత’తో ఆదిత్యనాథ్ ప్రభుత్వంను ఓడించవచ్చని అంచనాలు వెస్తూకొంటూ వస్తున్నారు. 

అయితే ఢిల్లీ నుండి వచ్చిన బిజెపి పెద్దలు అందరు ఆదిత్యనాథ్ ప్రభుత్వ పనితీరును మెచ్చుకోవడం, ప్రజాకర్షణలో రాష్ట్రంలో ఆయనకు  గ్రహించడంతో ఆయన నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెడుతున్నామని స్పష్టం చేయడంతో ఎన్నికల పోరాటంపై బిజెపి కొత్త ఊపిరితో సిద్ధమవుతున్నది. పార్టీలోని వారంతా ఇప్పుడు ఒకే మాటతో ఆయన నాయకత్వంలో ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. 

బిజెపి నాయకత్వంలో కనిపిస్తున్న ధీమాతో పాటు, ప్రతిపక్షాలలో ఏర్పడిన చీలిక కారణంగా ఆదిత్యనాథ్ మరోమారు గెలుపొందడం తధ్యం అనే అంచనాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. మాయావతి మరో గత్యంతరం లేక ఒంటరిగా పోటీ చేస్తున్నా ఆమె ప్రధానంగా ముస్లిం ఓట్లపై కన్నేశారు. వారు మద్దతు ఇస్తే బిజెపిని ఓడిస్తామని బహిరంగంగా ఆమె ప్రకటించారు. 

అయితే ముస్లిం ఓటర్లే లక్ష్యంగా  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 100 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు అఖిల భార‌త మ‌జ్లిస్ ఈ ఇతేహ‌దుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ ప్రారంభించామ‌ని కూడా చెప్పారు. మరోవంక అఖిలేష్ యాదవ్ సహితం ముస్లిం ఓట్లపై  కొంతమేరకు పట్టుకలిగి ఉన్నారు. ముస్లిం ఓటర్లలో రాగాల చీలిక సహితం ఆదిత్యనాథ్ కు వరంగా మారే అవకాశాలు ఉన్నాయి. 

ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒకదానితో ఒకటి పోరాడటానికి సిద్ధమైతే బహుళ మూలల ఎన్నికలు బిజెపికి ప్రయోజనకరంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. “ప్రతిఒక్కరూ ఒకరిపై ఒకరు పోరాడుతుంటే, అది ఖచ్చితంగా బిజెపికి ప్రయోజనం చేకూరుస్తుంది” అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్డిఎస్) డైరెక్టర్ సంజయ్ కుమార్ చెప్పారు.

మరోవంక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకులతో కలిసి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య నివాసంలో జరిగిన భేటీ బీజేపీలో వినిపిస్తున్న విభిన్న స్వరాలకు చెక్ పెట్టేందుకే అని స్పష్టం అవుతున్నది. తిరిగి 2024 లోక్ సభ ఎన్నికలలో తిరిగి బీజేపీ అధికారమలోకి రావాలంటే 80 లోక్ సభ సీట్లు గల యుపి కీలకం కాగలదు. అందుకనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి గెలుపొందడం ఆ పార్టీకి ప్రతిష్టాకరంగా మారింది.

ఇట్లా ఉండగా, జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమిని 2024 నాటికి ఏర్పాటు చేయాలనీ శరద్ పవర్ చేస్తున్న ప్రయత్నాలకు సహితం యుపి ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇక్కడ తిరిగి బీజేపీ అధికారంలోకి రాగలిగితే వారి ప్రయత్నాలకు పురిట్లోనే అంతరం ఏర్పడే అవకాశం ఉంది. 

అయితే పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతున్న రైతుల నిరసనలు ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపగలవో చూడవలసి ఉంది. జాట్ ఓటర్లు గత ఎన్నికలలో బిజెపికి గట్టి మద్దతు దారులుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు జాట్ రైతులు బిజెపికి వ్యతిరేకంగా ఓట్ వేయాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ ఇచ్చిన పిలుపు ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడవలసి ఉంది. 

ఏది ఏమైనా వ్యక్తిగత ప్రజాదరణతో యోగి ఆదిత్యనాథ్ తో పోటీ పడగల నేత ఇప్పుడు యుపిలో లేరు. పైగా అవినీతిలో కూరుకు పోయిన ప్రభుత్వాలను చూస్తూ వస్తున్న యుపి ప్రజలకు నిజాయతీతో పాలన అందించారు. రాజకీయ అండదండలతో విజృమిస్తున్న నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించారు. 

మొదటిసారిగా యుపిలో పారిశ్రామికాభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించారు.  పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతో పాటు సులభతరం వాణిజ్యంలో యూపీని అట్టడుగు స్థాయి నుండి మొదటి వరుసలోకి తీసుకొచ్చారు. పలు విదేశీ కంపెనీలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఇవ్వన్నీ రాష్ట్రంలో యువతలో నూతన ఆశలు కలిగిస్తున్నాయి. 

ప్రతిపక్షాలలో నెలకొన్న అనైక్యతతో పాటు తన పాలన సహితం ఎన్నికలలో గెలుపుకు సహాయపడుతుందని యోగి ఆదిత్యనాథ్ ధీమాలో ఉన్నట్లు కనిపిస్తున్నది.