ఇంటివద్దనే టీకా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం  

కోవిడ్‌-19 తిరిగి తలెత్తే అవకాశం అంచనాలపై ఆధారపడినదేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోర్టుకు వెల్లడించింది. చిన్నారులను కోవిడ్‌ లక్ష్యంగా చేసుకుంటుందనే దానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని పేర్కొంది. అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాతి ద్వారా కేంద్రం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయాలను తెలిపింది. 

డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్‌, ప్రధానంగా పెద్దలకు, వికలాంగులకు వేయాలని అనేక విజ్ఞప్తులు వచ్చినట్లు కోర్టుకు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఎక్కువ టీకా, ఎక్కువ సమయం వృథా అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్‌ ద్వారా టీకా వేసిన తరువాత 30 నిమిషాలపాటు వ్యక్తుల ను పరిశీలించే అవకాశం ఉండదని తెలిపింది.

18 ఏళ్ల లోపు చిన్నారులకు టీకా ఇంకా 1,2,3 దశల పరీక్షల్లోనే ఉందని తెలిపింది. కోవిడ్‌ పరిస్థితిపై నిరంతరం జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ కేసులున్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్రాలను హెచ్చరించినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ నెల 25 నాటికి 31 కోట్లకు పైగా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య ఆరోగ్య శాఖ కోర్టుకు తెలిపింది.

ఈ ఏడాది చివ‌రికల్లా 156 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని కేంద్రం తెలిపింది. జూలై నాటికి 21 కోట్ల వ్యాక్సిన్లు, ఆగ‌స్టు-డిసెంబ‌ర్ మ‌ధ్య 135 కోట్ల వ్యాక్సిన్లు ల‌భిస్తాయ‌ని వెల్లడించింది. వ్యాక్సిన్ల సేక‌ర‌ణ‌కు కుదిరిన ఒప్పందాల ఆధారంగానే సుప్రీంకోర్టులో ఈ అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. కొన్ని సంస్థ‌ల‌తో వ్యాక్సిన్ల ఒప్పందాలు ఖరారు ప్ర‌క్రియ‌లోనే ఉన్నాయి.