డిసెంబర్‌ 31 నాటికల్లా అందరికి కరోనా టీకాలు

దేశంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికల్లా కరోనా టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని శనివారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉచిత టీకా పొందేందుకు అందరూ అర్హులేనని పేర్కొంది.

గత నెల 31న జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని తూర్పారబడుతూ పలు ప్రశ్నలను లేవనెత్తింది. వాటిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 375 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

వ్యాక్సిన్‌ సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్రాలు, ప్రైవేటు దవాఖానలు ఫిర్యాదు చేయడంతో విధానంలో మార్పులు చేసినట్టు అఫిడవిట్‌లో తెలిపింది. దేశంలో ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో 135 కోట్ల డోసులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం పరిమితంగా ఉండటం వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది.

ఇలా ఉండగా, కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో అన్ని దేశాలు విదేశీయుల రాకపై ఆంక్షలు విధిస్తున్నాయి. చాలా దేశాలు వ్యాక్సిన్‌ వేసుకొన్న వారినే తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే విదేశాల్లో చదువుకొనే విద్యార్థులు, క్రీడాకారులు తదితరుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను పాస్‌పోర్టులతో అనుసంధానం చేస్తామని ఫలితంగా ప్రయాణం సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌తో పాస్‌పోర్టు నంబర్‌ను అనుసంధానం చేసుకొనే వెసులుబాటు కొవిన్‌ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది.