పోలీస్ క్యాంప్‌పై ఉగ్ర‌వాదుల గ్రెనేడ్ దాడి

జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రంలోని శ్రీన‌గ‌ర్ సిటీలో పోలీస్ క్యాంప్ ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు గ్రెనేడ్ దాడికి పాల్ప‌డ్డారు. అయితే, ఉగ్ర‌వాదులు విసిరిన గ్రెనేడ్ పోలీస్ క్యాంప్‌పై ప‌డ‌కుండా రోడ్డుపై ప‌డి పేలిపోయింది.

ఈ పేలుడులో ఒక‌రు మృతిచెంద‌గా ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌న స్థ‌లంలో మొత్తం న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డి ఉండ‌గా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స ఒక‌రు మృతిచెందారు.

పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాలు సంయుక్తంగా శ్రీన‌గ‌ర్ సిటీలోని బార్బ‌ర్ షా చౌక్‌ ఏరియాలో భ‌ద్ర‌తా విధుల్లో ఉన్నారు. శ‌నివారం తెల్ల‌వారుజామున కారులో వ‌చ్చిన ఉగ్ర‌వాదులు ఆ క్యాంప్ వైపు గ్రెనేడ్ విసిరి పోయారు. అయితే, ఆ గ్రెనేడ్ రోడ్డుపైనే ప‌డి పేలిపోయింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. కింది వీడియోలో ఆ దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు.

కాగా, జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.

జమ్ముక‌శ్మీర్‌ విమానాశ్రయంలో శ‌నివారం అర్ధ‌రాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. వైస్‌ ఎయిర్‌ చీఫ్‌, ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరాతో ఫోన్‌లో మాట్లాడారు. మరో ఉన్నతాధికారి ఎయిర్‌ మార్షల్‌ విక్రమ్ సింగ్‌ను సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించమ‌ని ఆదేశించారు.