డెల్టా ప్లస్‌ పై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

కరోనా వైరస్‌ వ్యాప్తిలో భాగంగా నూతనంగా తలెత్తిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 48 డెల్టాప్లస్‌ కేసులు వెలుగుచూశాయని ఈ ప్రకటనలో తెలిపింది.

డెల్టా ప్లస్‌ వ్యాప్తి పెరిగిందని తెలిపింది. ఈ వేరియంట్‌ ఊపిరితిత్తుల కణాలను బలంగా అతక్కుంటుందని పేర్కొంది. దీనిపై మోనోక్లోనల్‌ యాంటీబాడీ ప్రతిస్పందన కూడా చాలా తక్కువగా ఉంటోందని, అందువల్ల వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు మరింత దృష్టి కేంద్రీకరించాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను ఆందోళనకర వైరస్‌గా పరిగణించాలని ఐసిఎంఆర్‌ మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ గంగఖేడ్కర్‌స్పష్టం చేశారు. . డెల్టా ప్లస్‌తో మెదడు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన తెలిపారు. డెల్టా ప్లస్‌ విషయమై ఐసిఎంఆర్‌ అంటువ్యాధుల విభాగం చీఫ్‌ డాక్టర్‌ సమీరన్‌ పండా స్పందిస్తూ ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు వెలుగు చూసినప్పటికీ ఇది థర్డ్‌ వేవ్‌ ప్రారంభానికి సంకేతమని చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.