ఓబీసీ రిజర్వేషన్ల కోటా పోరాటంలో ఫడ్నవీస్ అరెస్ట్

మహారాష్ట్రలోని ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) రిజర్వేషన్ కోటాను కాపాడాలంటూ శనివాం నిరసన చేపట్టిన ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ సహా వందలాది భారతీయ జనతా పార్టీ నేతలను, కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సెక్రెటేరియట్ వద్ద చెక్కాజామ్ నిర్వహించాలని తలపెట్టారు.

ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీకి  అధికారం అప్పగిస్తే ఓబీసీలకు స్థానిక సంస్థలలో తాము రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇవ్వలేని పక్షంలో తాను రాజకీయాల నుండి నిష్క్రమిస్తానని ప్రకటించారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని చెబుతూ రాష్ట్ర ప్రజలను  మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం తప్పుదారి పట్టుతున్నదని రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ధ్వజమెత్తారు.

ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో పరిష్క్రయింపవచ్చని చెబుతూ ఒక చట్టం తీసుకు రావడం ద్వారా రిజర్వేషన్ కల్పించవచ్చని ఫడ్నవిస్ స్పష్టం చేసారు. ఈ ప్రభుత్వపు అబద్దాలను బహిర్గతం చేసేవరకు తాము విశ్రమింపబోమని స్పష్టం చేశారు.

దానికి ముందు ముంబైలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి సెక్రెటేరియట్ వరకు ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ర్యాలీ ప్రారంభమవుతున్న క్రమంలోనే వందలాది మంది బీజేపీ నేతలను కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై నాగ్‌పూర్‌లో నిరసన చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను సైతం అరెస్ట్ చేశారు.

ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యే కాలిదాస్ కొలాంబకర్ మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్ల కోటాను రక్షించడంలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ సమస్య కేంద్ర ప్రభుత్వం చొరవతోనే పరిష్కారం అవుతుందని స్పష్టం చేస్తూ,  దానికి పూర్తి సహకారాన్ని తమ  నేత దేవేంద్ర ఫడ్నవీస్ అందిస్తారని ప్రకటించారు.

ఈ సమస్య పరిష్కారానికి మహా వికాస్ అగాఢీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు రావాలని హితవు చెప్పారు. కానీ వారు రావడం లేదని ధ్వజమెత్తారు. సమస్య పరిష్కారం అయితే ఆ క్రెడిట్ దేవేంద్ర ఫడ్నవీస్‌కు వెళ్తుందని వాళ్లు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. “రాష్ట్రంలోని 1,000 ప్రాంతాల్లో నిరసన చేపట్టాం. మా ప్రధాన డిమాండ్ ఒక్కటే. ఓబీసీలకు స్థానిక ఎన్నికల్లో ఉన్న 27శాతం రిజర్వేషన్లను కొనసాగించాలి’’ అని తెలిపారు.