ఐడీబీఐ బ్యాంకులో వాటాల‌ ఉపసంహరణ పక్రియ

ఐడీబీఐ బ్యాంకులో వాటాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్ణయానికి వచ్చిన కేంద్రం ఈ బ్యాంకులో వ్యూహాత్మ‌క ఈక్విటీ (వాటాల‌) విక్ర‌యానికి స‌హ‌క‌రించేందుకు లీగ‌ల్ అడ్వైజ‌ర్ల నియామ‌కానికి బిడ్ల‌ను ఆహ్వానించింది. ట్రాన్సాక్ష‌న్స్ అండ్ లీగ‌ల్ అడ్వైజ‌ర్ల నియామ‌కానికి ప్ర‌భుత్వం ప‌చ్చ జెండా ఊపింది.

వ్యూహాత్మ‌క వాటాల విక్ర‌యంతోపాటు బ్యాంక్ యాజ‌మాన్య నియంత్ర‌ణ హ‌క్కుల‌ను కూడా ప్రైవేట్ సంస్థ‌లు లేదా వ్య‌క్తుల‌కు వ‌దిలేయ‌నున్న‌ది. ఈ మేర‌కు నాలుగు  రోజుల క్రితం బిడ్ల‌ను ఆహ్వానిస్తూ నోటిఫికేష‌న్ జారీ చేసింది. బ్యాంకులో ప్ర‌భుత్వానికి గ‌ల వ్యూహాత్మ‌క వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి అన్ని ర‌కాల అంశాల‌పై క‌న్స‌ల్టింగ్ సంస్థ‌లు, ఇన్వెస్ట్‌మెంట్ లేదా మర్చంట్ బ్యాంక‌ర్స్‌, ఆర్థిక సంస్థ‌ల‌తో ట్రాన్సాక్ష‌న్ అడ్వైజ‌ర్ సంప్ర‌దిస్తారు.

వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌పై ఉత్త‌మ‌మైన విలువ పొందేందుకు చ‌ర్య‌లు సూచిస్తారు ట్రాన్సాక్ష‌న్ అడ్వైజ‌ర్‌. ఎప్పుడు వాటాల‌ను ఉప‌సంహ‌రించాల‌న్న అంశంపై విధి విధానాల రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వానికి స‌హ‌కరిస్తారు. శక్తి సామ‌ర్థ్యాలు గ‌ల ఇన్వెస్ట‌ర్ల కోసం రోడ్‌షోలు నిర్వ‌హిస్తారు.

బిడ్డ‌ర్ల షార్ట్ లిస్టింగ్‌లో సంప్ర‌దింపులు, స‌ర‌స‌మైన రిజ‌ర్వు ధ‌ర‌, ఈ-డేటా రూమ్ ఏర్పాటులో ఐడీబీఐ బ్యాంకుకు స‌ల‌హాదారు సాయ ప‌డ‌తారు. ప్ర‌స్తుతం ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్ర‌భుత్వానికి 45.48 శాతం వాటా ఉంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి 49.24 శాతం వాటా ఉంది. మిగ‌తా 5.29 శాతం ప‌బ్లిక్ షేర్ హోల్డ‌ర్లు ఉన్నారు. ఐడీబీఐ బ్యాంక్ టేకోవ‌ర్ బిడ్డింగ్‌లో ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు బిడ్లు దాఖ‌లు చేయ‌రాదు. వ‌చ్చే నెల 13 లోగా ట్రాన్సాక్ష‌న్స్ అండ్ లీగ‌ల్ అడ్వైజ‌ర్లు బిడ్లు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. మిగ‌తా రెండు బ్యాంకుల‌తో పోలిస్తే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీక‌ర‌ణ వేగంగా జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.