చమురు ధరలు తగ్గించాలని ఒపెక్‌ను భారత్ డిమాండ్

ముడి చమురు ధరలు ‘భరించగలిగే స్థాయిలో’ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఒపెక్‌ను (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య– ఓపీఈసీ) భారత్‌ డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా రిటైల్‌ ఇంధన ధరలు రికార్డు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో భారత్‌ ఈ కీలక పిలుపునిచ్చింది. 

చమురు ధరలను ‘తగిన సమంజసమైన శ్రేణిలో’ ఉండేలా తక్షణ చర్యలు అవసరమని సూచించింది. ప్రత్యేకించి ఉత్పత్తి కోతల విధానానికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియాసహా పలు ఒపెక్‌ దేశాలు భారత్‌ ప్రధాన చమురు వనరుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ మహమ్మద్‌ సనౌసి బర్కిం దోతో భారత్‌ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చమురు ధరల విషయమై వర్చువల్‌గా చర్చలు జరిపారు. 2019 ఏప్రిల్‌ తరువాత మొదటిసారి అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు బేరల్‌కు 75 డాలర్లపైకి ఎగసిన సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా సుంకాలతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్,  డీజిల్‌ ధర దాదాపు రూ.100 స్థాయికి చేరింది. 

ఈ నేపథ్యంలో తగిన స్థాయిలో అంతర్జాతీయంగా ధర ఉండాలని భారత్‌ కోరినట్లు ఒక ప్రకటనలో ఒపెక్‌ తెలిపింది. అనంతరం చమురు మంత్రిత్వశాఖ కూడా ఒక ప్రకటన చేస్తూ, ‘‘క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వినియోగదారులు అలాగే ఎకానమీ రికవరీపై చూపుతున్న ప్రభావాన్ని చర్చించారు. భారత్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి పరిస్థితులు దారితీస్తున్నాయని వివరించారు’’ అని పేర్కొంది.

సరఫరాల కోతలకు ముగింపు పలకాలని భారత్‌ పలు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఒపెక్‌ దాని అనుబంధ దేశాలు (ఒపెక్‌ ప్లస్‌) పట్టించుకోవడం లేదు. దీనితో ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్‌ తన చమురు అవసరాలకు ప్రత్యామ్నాయ దేశాలపై  దృష్టి సారిస్తోంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ చమురు దిగుమతుల్లో ఒపెక్‌ వాటా మేలో 60 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో ఇది ఏకంగా 74 శాతంగా ఉండడం గమనార్హం.

క్రూడ్‌ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్‌ కొనుగోలు చేస్తుందని కూడా ధర్మేంద్ర  ప్రధాన్‌ స్పష్టం చేశారు  తాజా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్‌ ప్రాధాన్యత ఇస్తోందా? అన్న అంశంపై ప్రధాన్‌ సమాధానం ఇస్తూ,  ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్‌ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం” అని తేల్చి చెప్పారు. 

“మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్‌. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు దిగ్గజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని పేర్కొన్నారు.  భారత్‌లో రిఫైనర్స్‌ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతుండడం కీలకాంశం. 

ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్‌ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి విచారం వ్యక్తం చేశారు. భారత్‌ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్లాజిజ్‌ బిన్‌ సల్మాన్‌ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’  నుంచి  ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరిని భారత్‌ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్‌ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్‌ నిర్ణయమని పేర్కొన్నారు.