ముంపు బారిన పోలవరం నిర్వాసిత గ్రామాలు

ముంపు బారిన పోలవరం నిర్వాసిత గ్రామాలు

పోలవరం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల గోదావరికి పూర్తి స్థాయిలో వరద రాకుండానే నిర్వాసిత గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా గోదావరి బ్యాక్‌ వాటర్‌ పెరగడంతో దేవీపట్నం మండలంలో దండంగి వాగు పొంగి ప్రవహిస్తుండడంతో దండంగి, చిన్న రమణయ్యపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి ప్రజలు పడవపై రాకపోకలు సాగిస్తున్నారు. 

దండంగి, గుబ్బలపాలెం, తొయ్యేరు, ఎ.వీరవరం పరిసర ప్రాంతాల్లో పంట భూముల్లోనూ వరద నీరు చేరింది. ఎ.వీరవరం వద్ద కడమ్మవాగుకు వరద నీరు పోటెత్తింది. తోయ్యేరు వద్ద చప్టాపై నాలుగు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద బ్యాక్‌ వాటర్‌ క్రమంగా పెరగడంతో వెనుక భాగాన ఉన్న దేవీపట్నం మండలంలోని పోచమ్మ గండి, పూడిపల్లి, దేవీపట్నం గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. 

మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర వాగులు కూడా పొంగి పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. గోదావరి బ్యాక్‌ వాటర్‌ రోజురోజుకూ పెరుగుతుండడంతో ముంపు మండలాలైన దేవీపట్నం, విఆర్‌.పురం, చింతూరు, ఎటపాక, కూనవరం ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

గతంలో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అంటే, గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంటే పోలవరం ముంపు మండలాలు వరద తాకిడికి గురయ్యేవి. కాఫర్‌ డ్యామ్‌ వల్ల ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా రాకుండానే బ్యాక్‌ వాటర్‌ కారణంగా ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 5.80 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.