జగన్ పై సుమోటోగా హైకోర్టు 11 కేసుల విచారణ

ఎపిలోని పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన 11 కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఎపి ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై దాఖలైన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను సుమోటోగా తీసుకున్న హైకోర్టు ఆ కేసులపై విచారణను బుధవారం ప్రారంభించింది. అవినీతి, అక్రమాస్తుల కేసులు కాకుండా.. జగన్‌పై రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. 

విపక్షంలో ఉండగా కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ అప్పట్లో పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లి డాక్టర్ల చేతిలోని పత్రాలను లాక్కున్నారు. అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబును దుర్భాషలాడినట్లు జగన్‌పై కేసు నమోదైంది. జగన్‌ సిఎం కాగానే ఆ కేసును ఎత్తివేశారు. 

అంతేకాకుండా అధికార బలంతో టిటిడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సామినేని ఉదయభానులతో సహా దాదాపు అన్ని జిల్లాల్లో అనేక మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలపై ఉన్న కేసులను ఉపసంహరింపజేశారు. ఇందులో కొన్నింటిని జీవోలు జారీ చేసి కొట్టివేయగా, మరికొన్నింటిని స్థానిక పోలీసు అధికారులే (ఎస్‌హెచ్‌ఒ) మూసివేశారు.

దీంతో జగన్‌పై నమోదైన పలు కేసుల్లో దిగువ కోర్టులు కేసు మెరిట్‌ను పరిశీలించకుండా,  సరైన విధివిధానాలను పాటించకుండా కేసులు కొట్టివేసినట్లు హైకోర్టుకు ఫిర్యాదులు వచ్చాయి. ఇలా దిగువ కోర్టులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి హైకోర్టులో ఒక ఉన్నతస్థాయి కమిటీ ఉంటుంది. జగన్‌పై హైకోర్టుకు అందిన ఈ ఫిర్యాదులను ఈ కమిటీ క్షుణ్నంగా పరిశీలించి న్యాయస్థానానికి ఒక నివేదికను సమర్పించింది.

ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసులను చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకున్నారని కమిటీ నివేదిక ఇవ్వడంతో సుమోటోగా న్యాయస్థానం విచారణ చేపట్టింది. 11 కేసుల ఎత్తివేత నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని హైకోర్టు తేల్చనుంది. 

ఒక వేళ కేసుల ఎత్తివేత వ్యవహారాన్ని పున్ణసమీక్షించాలని న్యాయస్థానం భావిస్తే అది పెద్ద సంచలనమే అవుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ 11 కేసుల్లో తొలి ప్రతివాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రెండో ప్రతివాదిగా ఎస్‌హెచ్‌ఒని చేర్చారు. మూడో ప్రతివాదిగా ఒక్కో కేసులో ఒక్కొక్కరు (ఫిర్యాదుదారులు) ఉన్నారు. 

అన్ని కేసుల్లోనూ నాలుగో ప్రతివాదిగా జగన్‌ పేరే ఉంది. కాగా, ప్రభుత్వం తరుఫున హైకోర్టులో ఎజి వాదనలు వినిపిస్తున్నారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను సుమోటోగా హైకోర్టు తీసుకోవడం దేశంలోనే అరుదైనదని ఏజీ పేర్కొన్నారు.