పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వంకు సుప్రీం హెచ్చరిక 

ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఆ రాష్ట్రం ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ద్దు చేయ‌లేదు. ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని కోర్టులో ఏపీ ఓ అఫిడ‌విట్‌ను స‌మ‌ర్పించింది. ఈ నేప‌థ్యంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యింది. 

ఒక‌వేళ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే, దాని వ‌ల్ల ఒక్కరు మ‌ర‌ణించినా.. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని కోర్టు త‌న తీర్పులో హెచ్చ‌రించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధ‌న పాటిస్తున్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాస‌నం చెప్పింది. ఏపీలో బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోర్టు ఈ హెచ్చ‌రిక చేసింది.

మ‌హ‌మ్మారి వేళ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఎలా నిర్ణ‌యం తీసుకుంద‌ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని 5.2 ల‌క్ష‌ల మంది విద్యార్థులను 34 వేల రూముల్లో ఎలా కూర్చోబెడుతారో వివ‌రించాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని కోర్టు కోరింది. 

ప్ర‌తి ఒక రూమ్‌లో క‌నీసం 18 మంది విద్యార్థుల‌ను కూర్చోబెట్ట‌నున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం కోర్టుకు చెప్పింది. సెకండ్ వేవ్‌లో ఏం జ‌రిగిందో చూశామ‌ని, ప‌లు రకాల వేరియంట్లు దాడి చేస్తున్న స‌మ‌యంలో మీరెందుకు ఇలా నిర్ణ‌యం తీసుకున్నార‌ని కోర్టు అడిగింది. 

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు 15 రోజుల స‌మ‌యం ఎలా స‌రిపోతుంద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. జ‌స్టిస్ ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసు విచారించింది. రేపు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు కేసు వాయిదా ప‌డింది. ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున అడ్వ‌కేట్ మ‌హ‌ఫూజ్ న‌జ్కీ వాదించారు.