నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురు

బ్యాంకులను మోసగించిన కేసులో నిందితుడు నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనను భారత దేశానికి అప్పగించేందుకు జారీ అయిన ఆదేశాలపై అపీలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. 

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేరకు మోసగించినట్లు, బూటకపు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినట్లు ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించడంతోపాటు మనీలాండరింగ్‌ నేరానికి పాల్పడినట్లు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ), ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కేసులను నమోదు చేశాయి. ఆయన 2019 మార్చిలో అరెస్టయ్యారు. అప్పటి నుంచి దక్షిణ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌లోని జైలులో ఉంటున్నారు.  

నీరవ్ మోదీ అపరాధి అని, భారత దేశంలో ఆయనపై విచారణ జరగవలసి ఉందని, ఆయనను తిరిగి భారత దేశానికి పంపించాలని 2021 ఫిబ్రవరి 25న వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి శామ్ గూజీ తీర్పు చెప్పారు. ఆయనను భారత దేశానికి అప్పగించేందుకు బ్రిటన్ హోం సెక్రటరీ ప్రీతి పటేల్ 2021 ఏప్రిల్ 15న ఆదేశాలు జారీ చేశారు. 

నీరవ్ మోదీతోపాటు ఆయన సహచరులు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులతో కుమ్మక్కై సుమారు 1.4 బిలియన్ డాలర్ల మేరకు ఆ బ్యాంకును మోసగించినట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది.