వాట్సప్‌ను నిషేధించాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్‌

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన ఐటి నిబంధనలను సవాలు చేస్తున్న వాట్సప్‌ను నిషేధించాలంటూ కేరళ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఇడుక్కికి చెందిన ఒమన కుట్టన్‌ అనే సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బుధవారం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

వాట్సప్‌ను నిషేధించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. వాట్సాప్‌ సంస్థ గోప్యతా నియమాలను పాటించడం లేదని, ఆ సంస్థకు చట్టాన్ని ప్రశ్నించే హక్కు లేదని పిటిషనర్‌ పేర్కొన్నాడు. 

వాట్సాప్‌ ద్వారా ఫేక్‌ మేసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్‌ అవుతూ కొన్నిసార్లు తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్నాయని పేర్కొన్నాడు. దేశ వ్యతిరేక శక్తులు వీటిని బాగా వినియోగించుకుంటున్నాయని తెలిపారు. 

జాతి భద్రత దఅష్ట్యా ఏ సంస్థ అయినా ప్రభుత్వానికి సహకరించాలని, లేకపోతే అలాంటి సంస్థను దేశంలో కార్యకలాపాలు సాగించకుండా నిషేధించాలని పిటిషనర్‌ కోరాడు. కాగా, సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయ్యే మెసేజ్‌ల ఆరిజన్‌ క్రియేటర్‌ (మేసేజ్‌ను రూపొందించిన వ్యక్తి)ను గుర్తించాలని నూతన ఐటి నిబంధనలు పేర్కొంటున్నాయి. 

తప్పుడు సందేశాలు పోస్ట్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరాలను మాత్రమే అందించాలని ఈ చట్టం పేర్కొంటోందని తెలిపారు. అయితే వాట్సాప్‌ మెసేజ్‌లు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయి. ఇందులో కంటెంట్‌ పంపిన వారితో (ఆరిజినేటర్స్‌) పాటు, రిసీవర్ల ఎన్క్రిప్షన్‌ కూడా భాగంగా ఉంటుంది. 

అందువల్ల ఆరిజినేటర్స్‌ వివరాలతో పాటు రిసీవర్ల ఎన్‌క్రిప్షన్‌ను కూడా బ్రేక్‌ చేయాల్సి వస్తుందని వాట్సాప్‌ చెబుతోంది. ఆ నిబంధన భారత రాజ్యాంగంలోని గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటించాలని ఇప్పటికే వాట్సప్‌ ఢిల్లీ హైకోర్టును కోరింది.