ఆర్థిక నేరగాళ్ల రూ 18 వేల కోట్ల ఆస్తుల జప్తు

భారత్‌ బ్యాంకులను పెద్ద మొత్తంలో మోసం చేసి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం సీజ్‌ చేసింది. ఇందులో విజరు మాల్యా, నీరవ్‌ మోడీ, మోహుల్‌ ఛోక్సీ ఆస్తులున్నాయి. మొత్తం 18,170 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను, షేర్లను అటాచ్‌ చేసింది. 
 
ఇది బ్యాంకులను మోసం చేసిన మొత్తంలో 80 శాతమన్నమాట. ఇడి జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులకు, కేంద్రానికి తరలించింది. కేవలం ఆస్తులనే కాకుండా రూ. 9,371.17 కోట్ల విలువైన షేర్లను కూడా జప్తు చేశామని ఇడి పేర్కొంది. వీటిని ప్రభుత్వ బ్యాంకులకు, కేంద్రానికి తరలించామని తెలిపింది.

ప్రముఖ లిక్కర్‌ బారన్‌ విజరు మాల్యా, వజ్రాల వ్యాపారులు నీరవ్‌, మోహుల్‌ ఛోక్సీ.. మొత్తంగా రూ.22,583.83 కోట్లను బ్యాంకులకు మోసం చేయగా రూ 18,170 కోట్ల ఆస్తులను ఇడి స్వాధీనపర్చుకుంది.  వీరు ముగ్గురు ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నారు. 
 
వారిని భారత్ కు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ ముగ్గురికి చెందిన లావాదేవీల‌ను స‌మీక్షించింది. ముంబయిలోని మనీలాండరింగ్‌ నిరోధక చట్టానికి చెందిన ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఇడి అటాచ్‌ చేసిన షేర్లు (రూ.6,600 కోట్లు) ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు బదిలీ చేసింది.
 
యునైటెడ్‌ బ్రేవరీస్‌ లిమిటెడ్‌ (యుబిఎల్‌)కు చెందిన రూ.5,800 కోట్ల షేర్లను డెబ్స్ట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (బిఆర్‌టి) అమ్మింది. జూన్‌ 25 నాటికి షేర్ల అమ్మకం ద్వారా రూ.800 కోట్లు వచ్చే అవకాశాలున్నాయని ఇడి తెలిపింది. అంతేకాకుండా, ఇడి సాయంతో, అంతకముందు షేర్లను అమ్మడం ద్వారా రూ.1357 కోట్లను బ్యాంకులు పొందాయి. మరి కొన్ని ఆస్తులను అమ్మడం ద్వారా రూ.7,981.5 కోట్లను పొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది.